
రాచరికాల్లో అధికారానికీ, దర్పానికీ, దానిద్వారా లభించే న్యాయానికీ రాజదండం చిహ్నం. ఈమధ్యకాలంలో బుల్‌డోజర్ అలాంటి పాత్ర పోషిస్తున్న వైనం కనబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక బుల్‌డోజర్ అర్థం, దాని పరమార్థం మారిపోయాయి. ఆ రాష్ట్రాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు వాతలు పెట్టుకోవటం కూడా మొదలైంది.
ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఆవాసాలను కూల్చేసిన అధికారగణంపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు, ఇళ్లు కోల్పోయిన ఆరుగురు పిటిషనర్లకూ ఆరువారాల్లో రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు... ఈ ఉదంతం తమ అంతరాత్మను తీవ్రంగా కలవరపరిచిందని ధర్మాసనం తెలియజేసింది.
అధికారమంటే ఇష్టానుసారం ఏదైనా చేయడానికి దొరికిన లైసెన్స్‌గా భావించే సంస్కృతి దేశంలో ముదిరిపోయింది. ఒక్క యూపీలోనేకాదు... మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వగైరాల్లో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్న తీరు గమనిస్తే ఇదో అంటువ్యాధిగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది.
ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నా లేదా శిక్షపడినా... అధికార పక్షానికి అనుకూలంగా లేకపోయినా అలాంటివారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చేయడానికి బుల్‌డోజర్‌లు అత్యుత్సాహంతో ఉరుకుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాణ నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘించారని తేలినా, ప్రభుత్వ భూమినో, మరొకరి భూమినో దురా క్రమించి కట్టారని తేలినా అలాంటివాటిని కూల్చేయటాన్ని ఎవరూ తప్పుబట్టరు.
కానీ అందుకొక విధానం ఉండాలి. చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. తప్పు చేశారని ఆరోపణ లొచ్చినవారికి తగిన నోటీసులిచ్చి వారి సంజాయిషీ కోరాలి. సంతృప్తి చెందనట్టయితే ఆక్రమణ దారులకు హేతుబద్ధమైన వ్యవధినిచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలి.
ఇప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తున్న కేసు సంగతే తీసుకుంటే 2021 మార్చి 1న మొదటిసారి అక్కడ నివాసముంటున్నవారికి నోటీసులు వచ్చాయి. వారికి అంతకు దాదాపు మూణ్ణెల్ల ముందే... అంటే జనవరి 8న నోటీసులిచ్చినట్టు, అందులో ఆ నెల 27లోగా ఎవరికివారు సొంత ఖర్చులతో ఇళ్లు కూల్చేయాలని ఆదేశించినట్టు ఉంది. దానికి స్పందన రాకపోవటంతో తాజాగా నోటీసులు జారీచేశామని అందులో పేర్కొన్నారు.
మరో ఆరు రోజుల్లో బుల్‌డోజర్‌లతో వచ్చి ఇళ్లు కూల్చేశారు. తొలుత నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వటానికి చేసిన ప్రయత్నం విఫలం కావటంతో ఇళ్ల దగ్గర అతికించామన్న ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన బెంచ్ విశ్వసించలేదు. పిటిషనర్లకు సహేతుకమైన వ్యవధినిచ్చిన దాఖలా కనబడటం లేదని, ఇది పౌరులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సమకూరిన ఆవాస హక్కును ఉల్లంఘించటమేనని తేల్చిచెప్పింది.
ఈ తీర్పు అనేకవిధాల ఎన్నదగినది. పిటిషనర్లకు ఆ స్థలంపై చట్టబద్ధమైన హక్కుందా లేదా అన్న అంశంలోకి ధర్మాసనం పోలేదు. దానిపై వారు విడిగా న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిందే! 2023 ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన రాజకీయ నాయకుడు, పలు కేసుల్లో నింది తుడైన అతీఖ్ అహ్మద్ అక్రమంగా ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్లున్నాయని ప్రభుత్వం చెబుతోంది.
అయితే ఎన్నడో 1906లో అప్పటి అలహాబాద్ జిల్లా కలెక్టర్ షకీర్ అహ్మద్ అనే వ్యక్తికి 30 ఏళ్లకు లీజుకిచ్చి మరో రెండు దఫాలు పొడిగించుకునే వీలు కల్పించారని రికార్డులు చెబు తున్నాయి. 1960లో జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో షకీర్ దాని హక్కుల్ని వేరేవారికి బదలాయించాడు. ఆ తర్వాత క్రమంలో అది మరికొందరి చేతులు మారింది.
చివరకు ప్రస్తుత పిటిషనర్లు దాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఆ కొనుగోలు చెల్లకపోవచ్చు. అది ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాల్సిన భూమే కావొచ్చు. అంతమాత్రాన నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇళ్లు కూల్చటం సరైన చర్య కాదు. సుప్రీంకోర్టు తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది.
ఈ సందర్భంగా వేరేచోట బుల్‌డోజర్ కూల్చివేతలు సాగిస్తుండగా ఒకటో తరగతి బాలిక అనన్యా యాదవ్ తన స్కూల్ బ్యాగ్‌ను రక్షించుకోవటానికి మంటలంటుకున్న షెడ్ సమీపానికి వెళ్లిన వీడియోను న్యాయమూర్తులు ప్రస్తావించటం గమనార్హం. అలాంటి ఉదంతాలు అందరినీ దిగ్భ్రాంతిపరుస్తాయన్న వారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు.
గత నవంబర్‌లో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నారులూ, మహిళలూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి సంద ర్భాల్లో కూల్చివేతలకు పాల్పడిన అధికారుల నుంచి ఇళ్ల, దుకాణాల పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం వసూలు చేయాలని కూడా చెప్పింది. ఇతర మార్గదర్శకాలు కూడా రూపొందించింది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. కేవలం అయిదేళ్ల కోసం ఎన్నికై అధి కారంలోకొచ్చిన ప్రభుత్వాలు శాశ్వతంగా నిలిచే రాజ్యాంగ విలువలను కాలరాయటం, ఇష్టాను సారం ప్రవర్తించటం తప్పుడు సంకేతాలిస్తుంది. సాధారణ పౌరుల్ని కూడా చట్ట ఉల్లంఘనలకు ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. నాలుగేళ్లు ఆలస్యమైనా సర్వోన్నత న్యాయస్థానంలో బాధితులకు సరైన న్యాయం దక్కటం హర్షించదగ్గది.