
ప్రపంచానికి ప్లాస్టిక్ దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని వదిలించటానికి శాస్త్రవేత్తలు విస్తృత ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్నామ్నాయంగా ‘బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్’ను సృష్టించి, ప్లాస్టిక్ దెయ్యం విశ్వరూపం దాల్చకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటే... మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్.
మనిషంటేనే మట్టి. కానీ, మట్టి అంటకుండా మనిషి తన జీవితాన్ని సాగించటం మొదలు పెట్టాక... మనిషికి–మట్టికి మధ్య బాంధవ్యం తెగిపోతూ వచ్చింది. ఇప్పుడు మనిషి చేతులకు అంటింది మట్టి కాదు, ప్లాస్టిక్! మనిషి నిండు నూరేళ్లకు కాలం చేసినా, మనిషి వాడేసిన ప్లాస్టిక్ మాత్రం– ఏడేడు జన్మలు కూడా దాటి వెయ్యేళ్లు జీవించే ఉంటుంది. ఈ ప్లాస్టిక్ మహమ్మారి భూమిలో శిథిలం కాదు, సముద్రంలో చివికిపోదు. అగ్నిలో వేస్తే అసలుకే మోసం! ఆ కాలుష్య జ్వాలలు భూతాల్లా లేచి, భూతాపాన్నే పెంచేస్తాయి!
మట్టిలో కలిసిపోకుండా కొండల్లా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వెలువడే విషవాయువులు పర్యావరణానికి హాని చేస్తాయి. ప్రాణుల ఆరోగ్యాన్ని హరిస్తాయి. భూసారం క్షీణిస్తుంది. సముద్రగర్భం కలుషితమైపోతుంది. అంతరిక్షంలోనూ అక్కడ ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలు భవిష్యత్ వ్యోమగాముల కార్యకలాపాలకు ముప్పు కలిగిస్తాయి. మొత్తంగా పంచభూతాలనే ప్లాస్టిక్ పొట్టన పెట్టుకుంటుంది. ఎంత విషాదం! మనిషిని సృష్టించిన ప్రకృతిని, మనిషి సృష్టించిన ప్లాస్టిక్ మింగేస్తోంది. ∙∙
ప్రపంచంలో ప్రతి నిముషానికి 10 లక్షల ప్లాస్టిక్ బ్యాగులు వాడకంలోకి వస్తున్నాయి! ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ 98 కోట్ల 35 లక్షల 61 వేల కిలోల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. అత్యంత ప్రమాదకారి అయిన ‘ఒకసారి వాడి పడేసే’ ప్లాస్టిక్... వాడకంలో ఉన్న ప్లాస్టిక్‌లో 50 శాతం వరకు ఉంటోంది! ఇక సముద్ర వ్యర్థాల్లో 80 శాతం వరకు ప్లాస్టిక్ చెత్తే.
ఈ ప్రమాదాన్ని మరింతగా పెరగనివ్వకుండా ఉండేందుకు ప్రపంచ దేశాలు సిద్ధం అయ్యాయి. మనిషి దైనందిన జీవితంలోని అవసరాలకు అనుగుణంగా బయోప్లాస్టిక్ (బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్) పై పరిశోధనలు జరిపిస్తున్నాయి. మట్టిలో కలిసిపోయే బయోప్లాస్టిక్‌తో బ్యాగులు, వంటింటి పాత్రలు, కప్పులు, సాసర్‌లు, తేలికపాటి గృహోపకరణాలు, ప్యాకింగ్ మెటీరియల్ వంటివి ఉత్పత్తి చేయటానికి పనికొచ్చే పదార్థాల అన్వేషణపై పెట్టుబడులు పెడుతున్నాయి.
బయో–ప్లాస్టిక్ పరిశోధనలు
చైనా: సూక్ష్మజీవులను ఉపయోగించి బయో ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసే కొత్త పద్ధతులను చైనా పరిశోధకులు అన్వేషిస్తున్నారు.
అమెరికా: ఒక ఏడాది లోపు విచ్ఛిన్నమయ్యే ‘క్లింగ్ ఫిల్మ్’ వంటి వినూత్నమైన బయో ప్లాస్టిక్‌ను సృష్టించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆహార పదార్థాలను చాలాకాలం పాటు నిల్వ ఉంచేందుకు వాటి కంటెయినర్‌లకు చుట్టే పల్చటి పారదర్శక మెటీరియలే క్లింగ్ ఫిల్మ్.
ఐరోపా: ఐరోపా దేశాలు బయో ప్లాస్టిక్‌ల పరిశోధనలో చురుగ్గా పాల్గొంటున్నాయి. పర్యావరణ హితమైన ప్లాస్టిక్‌లను కనిపెట్టేందుకు కృషి చేస్తున్నాయి.
ఇండియా: బయో ప్లాస్టిక్‌ల ఉత్పత్తిలో వినూత్న విధానాలను ఆవిష్కరించే పరిశోధనల కోసం గువాహటి, మద్రాస్ ఐఐటీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మద్రాస్ ఐఐటీ పుట్టగొడుగులు, చెరకుపిప్పి, వరిగడ్డి నుంచి బయోప్లాస్టిక్‌ను తయారు చేసే పనిలో ఉంది.
బ్రెజిల్: ‘బ్రాస్కెమ్’ వంటి పెట్రో కెమికల్ కంపెనీలు బయో ప్లాస్టిక్‌పై విస్తృతమైన పరిశోధనలు జరుపుతున్నాయి.
దక్షిణాఫ్రికా: వ్యర్థ పదార్థాల నుండి బయో ప్లాస్టిక్‌లను అభివృద్ధి చేయటానికి దక్షిణాఫ్రికా పరిశోధకులు విశేష కృషి సల్పుతున్నారు.
ఈ దేశాలే కాక, కొరియా.. బాక్టీరియా నుంచి బయోడీగ్రేడబుల్ నైలాన్ ఉత్పత్తి చేస్తోంది. నార్వే.. నాచుతో స్ట్రాలు, స్పూన్లు తయారు చేస్తోంది. కెనడా పుట్టగొడుగుల నుండి అత్యంత పటిష్ఠమైన ప్లాస్టిక్‌లను వృద్ధి చేస్తోంది. బయో ప్లాస్టిక్ తయారీలో ప్రధానంగా మొక్కజొన్న పిండి, చెరకుపిప్పి, బంగాళదుంపల పిండి, గోధుమ పిండి వంటి పంట వనరుల్ని ఉపయోగిస్తున్నారు.
బయో ప్లాస్టిక్ ప్రయోజనాలు
కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గుతుంది: బయో ప్లాస్టిక్‌లు వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడంలో సహాయపడతాయి. అవి మొక్కల నుండి తయారౌతాయి కనుక మొక్కల పెరుగుదలకు అవసరమైన కార్బన్ డైయాకైడ్‌ను వాతావరణం నుండి సంగ్రహిస్తాయి. దీనినే ‘కార్బన్ సింక్’ అని పిలుస్తారు.
తక్కువ శక్తి వినియోగం: మామూలు ప్లాస్టిక్‌లతో పోలిస్తే బయోప్లాస్టిక్‌లను ఉత్పత్తి చేయడానికి తక్కువ శక్తి అవసరం. ఇలా శక్తి వినియోగం తగ్గటం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి తోడ్పడుతుంది.
వేగంగా విచ్ఛిన్నం: బయో ప్లాస్టిక్‌లు తయారీ పద్ధతిని అనుసరించి 18 నుండి 36 నెలల్లో అవి విచ్ఛిన్నమవుతాయి. ఇందుకు భిన్నంగా మామూలు ప్లాస్టిక్‌లు మట్టిలో పూర్తిగా కలిసిపోవటానికి 1,000 సంవత్సరాల పట్టవచ్చు.
పర్యావరణానికి మేలు: పరిశోధకులు సూక్ష్మ జీవ బ్యాక్టీరియాతో తయారు చేసిన బయోప్లాస్టిక్‌లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ బయోప్లాస్టిక్‌లను సహజ రబ్బరు, ఇతర పదార్థాలతో కలిపి మరింత పర్యావరణ హిత ప్లాస్టిక్‌లను సృష్టించవచ్చు.
అలవాటు మానాలి
ప్లాస్టిక్‌ను వాడే అలవాటు మనిషి నరనరాన ఎలాగైతే జీర్ణించుకుపోయిందో, అలా – ఆ ప్లాస్టిక్‌లోని విష రసాయనాలు మనిషి రక్తంలో కలిసిపోయి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒక కొత్త విషయాన్ని కనిపెట్టటం కంటే కూడా ఒక పాత అలవాటును మార్పించటానికే ఒక్కోసారి ప్రపంచ దేశాలకు ఎక్కువ ఖర్చు అవొచ్చు.
అయినప్పటికీ తగిన ప్రచారంతో, హెచ్చరికలతో, శిక్షల భయంతో ప్రజా చైతన్యం తెచ్చి, ప్లాస్టిక్ నుండి మనిషిని ప్రభుత్వాలే విముక్తం చేయాలి. శాస్త్రవేత్తలు పరిష్కారాన్ని కనిపెట్టినంత మాత్రాన మార్పు రాదు. మార్పువైపు మనిషిని నడిపించటం కూడా ముఖ్యమే.
– సాక్షి, స్పెషల్ డెస్క్
(చదవండి: అభినవ శ్రవణుడి ఆధ్యాత్మిక యాత్ర..!)