
చిత్రనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) అకస్మాత్తుగా బరువు తగ్గి, బక్కిచిక్కిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత త్వరగా బాగా బరువు తగ్గి అటు అభిమానులను, ఇటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. అదనపు బరువును తగ్గించడానికి అసహజ పద్ధతులను ఉపయోగిస్తున్నాడనే పుకార్లు జోరుగా వ్యాపించాయి. బరువు తగ్గడానికి ఓజెంపిక్ (Ozempic) ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై కరణ్ జోహార్ (కేజో) తాజాగా స్పందించాడు. అసలేంటీ ఓజెంపిక్ ఇంజెక్షన్, దీంతో అంత తొందరగా బరువు తగ్గవచ్చా? కరణ్ జోహార్ ఏమన్నాడు? తెలుసుకుందాం.
స్టైలిష్; ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే కరణ్ జోహార్ కరణ్ ఉన్నట్టుండి బక్కగా మారిపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. విపరీతంగా ఓజెంపిక్స్ తీసుకోవడంతోనే ఇలా అయ్యాడని కామెంట్లు వినిపించాయి.అయితే తాజాగా వీటిపై కరణ్ స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తాను బరువు తగ్గడానికి ప్రధానంగా రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తున్నానని తెలిపాడు. కఠినమైన ఆహార ప్రణాళిక ఈ మార్పునకు కారణమని కరణ్ వెల్లడించాడు.
ఇటీవల, కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో 'ఆస్క్ కేజో' సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులు అతని ఆకస్మిక బరువు తగ్గడం స్లిమ్‌గా మారడం వెనుక గల కారణం గురించి ప్రశ్నించారు. తాను ఇలా మారడానికి చాలా సమయం పట్టిందని, అందరూ అనుకున్నట్టుగా తాను ఎలాంటి మందులు తీసుకోలేదని స్పష్టంగా పేర్కొన్నాడు. ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, వ్యాయామంతో సరైన మార్గంలో బరువు తగ్గాను. ఇపుడు చాలా బావుంది.కొత్త ఉత్సాహం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అంతేకాదు తాను ఆరోగ్యంగా,హ్యాపీగా ఉన్నానంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు.
నెటిజన్లు ఒప్పుకోవడం లేదు
మరోవైపు కరణ్ జోహార్ ఓజెంపిక్‌ను ఉపయోగించడం లేదని చేసిన వాదనలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఓజెంపిక్‌తో మీరు బరువు తగ్గారని అంగీకరించడంలో తప్పు లేదు. బరువు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. బరువు మీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, మీరు బరువు తగ్గిన తర్వాత బాగానే ఉంటే, మీరు దానిని ఎలా కోల్పోయారన్నది ముఖ్యం కాదు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో గర్వపడండి మీ డ్రీమ్ అదే కదా .. ఉన్నది ఒక్కటే జీవితం. మన శరీరంతో సంతోషంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్..’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘అది ఓజెంపిక్ ముఖమే.. దానిని అంగీకరించడంలో సిగ్గు లేదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిని ఉపయోగిస్తోంది .దాని గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. సార్ నిజం నిర్భయంగా చెప్పడి" అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు.
కరణ్ గణనీయంగా బరువుగా తగ్గడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం కూడా ఆయన బరువు తగ్గడం ఆకర్షించింది. బరువు తగ్గడానికి ముందు, తరువాత అంటూ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. అలాగే కరణ్ జోహార్ ఓజెంపిక్ ఉపయోగిస్తున్నాడని ఎక్స్ ఖాతాలో ఒక యూజర్ ఆరోపించాడు. దీంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది.
అసలేంటీ ఓజెంపిక్
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న పెద్దలలో ఆహారం, వ్యాయామంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటానికి ఇంజెక్షన్ ఒక మెడిసిన్‌గా వాడతారు. 2017లో తొలిసారి దీనికి ఆమోదం లభించింది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలోకి ఇన్సులిన్ సరైన విడుదలను ఇది నియంత్రిస్తుంది. Ozempic ఇంజెక్షన్ ఆకలిని తగ్గిస్తుంది . జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది చివరికి బరువు తగ్గడానికి దారితీస్తుంది. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో బరువు తగ్గించే ఔషధంగా సెలబ్రిటీలు ఓజెంపిక్‌ను ఉపయోగిస్తున్నారా అని ఊహాగానాలు ఎక్కువయ్యాయి.