
ఎక్కువ మంది ఇష్టంగా తినే పండ్లలో సపోటా పండు కూడా ఒకటి. ఈ సీజనల్ ఫ్రూట్ రుచికే కాకుండా పోషకాలకు కూడా రారాజే. సపోటా చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు ప్రముఖ నూటీషనిస్ట్ పూజ మఖిజా మాటల్లో మీకోసం..
సపోటా పండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కీలకంగా వ్యవహరిస్తుంది. కాల్షియంతోపాటు మాగ్నిషియం, పొటాషియం, జింక్, కాపర్, పాస్పరస్, సెలినియం వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే! ఇక రోగనిరోధకతను పెంపుకు ఉపయోగపడే ‘ఎ, బి, సి’విటమిన్లు దీనిలో మెండే. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది.
కడుపులో చికాకు కలిగించే బొవెల్ సిండ్రోమ్ నివారణకు, మలబద్ధకం సమస్య పరిష్కారానికి దీనిలో ఫైబర్ గుణాలు చక్కగా పనిచేస్తాయి.
రక్తపోటును తగ్గించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. సపోటాలోని మాగ్నిషియం రక్తనాళాల పనితీరును క్రమబద్దీకరిస్తుంది. పొటాషియం రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలోని ఐరన్ రక్తహీనతతో బాధపడే వారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
అంతేకాదు సపోటాపండులో చర్మ, జుట్టు సమస్యలను నివారించి, సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేసే గుణం కూడా కలిగి ఉంటుంది. దీనిలోని పోషకాలు శరీరంలోని హానికారకాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మంపై ఏర్పడే ముడతల నివారణకు తోడ్పడుతుంది.
ఖర్జూరాలను సపోటాల్లో చేర్చి జ్యూస్ రూపంలో తీసుకున్న లేదా సపోటాను నేరుగా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పూజ మఖిజా సూచిస్తున్నారు.
చదవండి: Healthy Food: ఎదిగే పిల్లలకు ఈ పోషకాహారం ఇస్తున్నారా? పాలు, గుడ్డు, పాలకూర..