చిన్నప్పటి నుంచి డయాబెటిస్‌ ఉంటే ప్రెగ్నెన్సీలో సమస్యలు వస్తాయా..? | Pre Existing Diabetes And Pregnancy Information | Sakshi
Sakshi News home page

చిన్నప్పటి నుంచి డయాబెటిస్‌ ఉంటే ప్రెగ్నెన్సీలో సమస్యలు వస్తాయా..?

Published Sun, Dec 1 2024 3:53 PM | Last Updated on Sun, Dec 1 2024 4:07 PM

Pre Existing Diabetes And Pregnancy Information

నాకు 35 ఏళ్లు. చిన్నప్పటి నుంచి డయాబెటిస్‌ ఉంది. ఇన్సులిన్‌ తీసుకుంటున్నాను. ఈమధ్యనే పెళ్లయింది. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకుంటున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– సీహెచ్‌. శరణ్య, గుంటూరు

బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉండేలా చూసుకుని, ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేయాలి. దీనివల్ల తల్లీబిడ్డలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ప్రెగ్నెన్సీ బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవెల్స్‌ను పెంచుతుంది. మామూలుగా కన్నా ప్రెగ్సెన్సీ సమయంలో రెండు మూడు రెట్ల ఎక్కువ ఇన్సులిన్‌ మోతాదు మీద ఉండాల్సి వస్తుంది. అలాగే చెకప్స్‌ విషయంలో కూడా రెండు వారాలకు ఒకసారి అబ్‌స్టట్రిషన్‌ని సంప్రదించాలి. మీరు ఇప్పుడు ప్లాన్‌ చేస్తున్నారు కాబట్టి ఒకసారి హెచ్‌బీఏ1సీ లెవెల్స్‌ని చెక్‌ చేసుకోండి. 

థైరాయిడ్, సీబీపీ టెస్ట్స్‌ చేయించుకోండి. హెబీఏ1సీ 5.5 లోపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేయండి. ఆ లెవెల్‌ ఎక్కువగా ఉంటే డయబెటాలజిస్ట్‌ని సంప్రదించండి. దాన్ని కంట్రోల్‌ చేయడానికి ఇన్సులిన్‌ మోతాదును చేంజ్‌ చేస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం మూడు నెలల ముందు నుంచి ఫోలిక్‌యాసిడ్‌ 5ఎమ్‌జీ మాత్రలను తీసుకుంటూండాలి. ప్రెగ్నెన్సీలో సుగర్స్‌ చాలా ఫ్లక్చువేట్‌ అవుతాయి. మొదటి మూడు నెలల్లో సుగర్‌ డౌన్‌ (హైపోగ్లైసీమియా) అయ్యే ప్రమాదం ఎక్కువ. డయాబెటిక్‌ రెటీనోపతి అంటే సుగర్‌ వల్ల కంటి సమస్య .. ఇది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్‌ చేయించుకుంటూండాలి. 

డయాబెటిస్‌ కంట్రోల్‌లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్‌ అనామలీస్‌ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. అంతేకాదు లోపల బిడ్డ ఎదుగుదలా సరిగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా బిడ్డకు గుండె సమస్యలు ఎక్కువవుతాయి. గ్రహణం మొర్రి, అంగిలి చీలి ఉండటం వంటి సమస్యలూ ఉంటాయి. హెబీఏ1సీ ఏడు శాతం దాటిన వారిలో ఇలాంటివి కనిపిస్తాయి. 

రెండు, మూడు త్రైమాసికాల్లో అంటే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో గ్లూకోజ్‌ సరిగా నియంత్రణలో లేకపోతే గర్భస్థ శిశువుకు కూడా గ్లూకోజ్‌ ఎక్కువ వెళ్తుంది. దీనివల్ల బిడ్డ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటుంది. దాంతో బిడ్డకూ సుగర్‌ రావడం, డెలివరీ కష్టమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే క్రమం తప్పకుండా గ్రోత్‌ స్కాన్స్‌ చేయించుకుంటూండాలి. 24 వారాలప్పుడు బేబీ హార్ట్‌ స్కాన్‌ చేస్తారు. ఇన్ని కాంప్లికేషన్స్‌ ఉంటాయి కాబట్టే తొమ్మిదవ నెల వచ్చిన వెంటనే 37– 38 వారాలకు డెలివరీ ప్లాన్‌ చేస్తారు. బిడ్డ నాలుగు కేజీలు.. అంతకన్నా ఎక్కువ ఉంటే సిజేరియన్‌ ఆప్షన్‌కి వెళ్తారు. ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యేంత వరకు మల్టీవిటమిన్స్, డాక్టర్‌ నిర్ణయించిన మోతాదులో ఇన్సులిన్‌ను కంటిన్యూ చేయాలి. 

ప్రెగ్నెన్సీలో ఏ టైప్‌ ఇన్సులిన్‌ను వాడాలో ప్రిస్క్రైబ్‌ చేస్తారు. తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌ను మొదటి మూడునెలల్లో స్టార్ట్‌ చేయాలి. లేకపోతే బ్లడ్‌ గ్లూకోజ్‌ ఎక్కువ ఉన్నవారిలో రిస్క్‌ పెరుగుతుంది. హైబీపీ, ఫిట్స్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీరు సుగర్‌కి మాత్రలు వేసుకుంటున్నట్లయితే అవి ప్రెగ్నెన్సీలో సురక్షితమో కాదో డాక్టర్‌ని సంప్రదించి తెలుసుకోవాలి. ఒకవేళ అవి సురక్షితం కాకపోతే వేంటనే ఆపేయించి, సురక్షితమైన మందులను ప్రిస్క్రైబ్‌ చేస్తారు. 

డెలివరీ తర్వాత చాలామందికి బ్లడ్‌ గ్లూకోజ్‌ నార్మల్‌ స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు మందుల మోతాదు కూడా తగ్గించేస్తారు. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ కచ్చితంగా ఇవ్వాలి. డెలివరీ తర్వాత బిడ్డకు హఠాత్తుగా లో సుగర్‌ అవొచ్చు. అందుకే సీనియర్‌ నియోనేటాలజిస్ట్స్‌ ఉన్న చోటే డెలివరీ ప్లాన్‌ చేసుకోవాలి. సుగర్‌ డౌన్‌ అయితే కొంతమంది పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. 

ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీలో మూడు నెలలకు ఒకసారి కంటి, కిడ్నీకి సంబంధించి స్క్రీనింగ్‌ చేయించుకుంటూండాలి. డయాబెటిస్‌ కంట్రోల్‌లో లేనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ అయిన మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యే చాన్సెస్, కంజెనిటల్‌ అనామలీస్‌ (పుట్టుకతో వచ్చే లోపాలు) ప్రమాదాలు ఎక్కువ. 

(చదవండి: పొంచే ఉంది.. కొంచెం జాగ్రత్త!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement