
‘‘లోకంలో ఎక్కువమంది అన్యోన్యత.. అంటే కమ్యునికేషన్స్ సరిగా లేక సమస్యలు తెచ్చుకుంటున్నారు’’మహానగరంలో పెద్ద దేవాలయ ప్రాంగణం. పురాణ కాలక్షేపం జరుగుతోంది. తీర్చిదిద్దినట్లున్న వరుసల్లో భక్తులంతా కూర్చొని స్వామివారి ప్రవచనం శ్రద్ధగా వింటున్నారు.‘‘సమాచార లోపం వల్లే మెజార్టీ స్త్రీ పురుషుల్లో అన్యోన్యత దెబ్బతింటోంది. ఒకరు చెప్పింది మరొకరు సాంతం వినడం లేదు. ఠపీమని సమాధానం మాత్రం ఇచ్చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ట్రాక్ ఇలా ఫాస్ట్ ఫాస్ట్‌గా అయిపోవాల. నిదానం గాని, ఓ విధానం గాని ఉండట్లేదు’’భక్తజన శ్రోతలు ముసిముసిగా నవ్వుకున్నారు. కాని, ప్రియతమ్ నవ్వలేదు. అతని పక్కనే కూర్చున్న సుందరిలో కూడా స్వామివారి మాటలు నవ్వు పుట్టించలేదు. వారిద్దరూ భార్యాభర్తలు. అయినా గంభీర వదనాలతో ఉన్నారు.
సుందరి.. పెళ్లయిన కొత్తలో భర్తను పేరులోనే కాకుండా అతడేం చేసినా ఇష్టసఖుడిగానే తలచేది, కొలిచేది. ప్రియతమ్.. భార్య చిలుకలు చుట్టి ఇచ్చినా, చిలుకపలుకులు పలికినా ‘గాల్లో తేలినట్టుందే’ అని సంబరపడిపోయేవాడు. మూడేళ్లు గడిచాయి. ఆ ముచ్చట్లు మాయమయ్యాయి.‘‘వాళ్ల కడుపున ఓ కాయ కాస్తే అన్నీ సర్దుకుపోతాయి’’ అని పెద్దవాళ్లు అనుకున్నదేమీ జరగలేదు. కాలం గడుస్తున్నకొద్దీ ఒకరిమీద మరొకరికి చిరాకు. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. తమ ఇంట్లోనే తాము పరాయివాళ్లలాగా గడుపుతున్నారు. అయినా సరే, ఇద్దరిలో ఏ చిన్న అవసరం ఎవరికొచ్చినా మిగతావారి మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఎవరి రాజ్యంలో వారు సామంతులు మరి.
మామూలుగా అయితే వంటగది ఆడవాళ్ల రాజ్యం. ఆక్కడ ‘మగా’నుభావులకు చోటుండదు. కిచెన్స్ రూమ్ వాళ్ల ఇష్టారాజ్యం. ఇదంతా ఒకప్పటి మాట. మహిళలు ఇప్పుడు పురుషులతో పోటీపడి ఉద్యోగాలు చేస్తున్నారు.‘వంట చేయడం ఏమైనా బ్రహ్మవిద్యా? యూ ట్యూబ్ చూసి చేసేయడమే కదా. ఆ మాత్రం వంటలు మేమూ చేయగలం’ అంటూ ఎంతోమంది మగమహారాజులు నారీమణులకు తీసిపోకుండా ఇప్పుడు వంటింట్లో గరిటె తిప్పుతున్నారు.కాని, ప్రియతమ్ ఆ పని చెయ్యలేడు. తనకు స్టవ్ వెలిగించడమే సరిగా రాదు. ఎలాగోలా వెలిగించినా, బర్నర్ ఎటు తిప్పితే సిమ్మో, ఎటు తిప్పితే కాదో తనకు ఇప్పటికీ కన్స్ ఫ్యూజనే. ఒకసారి స్టవ్ మీద పాలు మరుగుతున్నాయి. పాలు పొంగిపోతున్నాయని పొయ్యి దగ్గరకు పరిగెత్తి ఆ గాభరాలో వెంటనే స్టవ్ కట్ట లేకపోయాడు. గభాల్న పాలపాత్ర దించేసి, చేతులు కాల్చుకున్నాడు. అందుకే కప్పు టీ కావాలన్నా సుందరి చేసి ఇవ్వాల్సిందే! వంటగది సుందరికి ఇష్టారాజ్యం అయితే, ప్రియతమ్‌కు దుర్భేద్యమైన కోట.
డబ్బుల్ని ఒకేసారి ఎక్కువగా చూస్తే సుందరికి గుండెలు ఝల్లుమంటాయి. ఆ పులకరింతలో వాటిని సరిగా లెక్కపెట్టలేకపోతుంది. ఎప్పుడైనా లెక్కపెట్టాల్సి వస్తే ఒకటి రెండు సార్లు లెక్కపెట్టినా, పది రూపాయలు ఎక్కువో తక్కువో అవుతుంది. అందుకే డబ్బు జోలికి తనెప్పుడూ స్వతంత్రంగా వెళ్లలేదు. ప్రియతమ్‌ను కట్టుకున్నాక సహజంగా ఉండే స్వాతంత్య్రం కూడా పోయింది. మనీపర్స్ ప్రియతమ్‌కు అల్లాఉద్దీన్స్ అద్భుత దీపం అయితే సుందరికది అర్థంకాని మాయల ద్వీపం.రోజులు గడిచేకొద్దీ ఏ చిన్న అవసరమైనా, ఒకర్నొకరు అడుక్కోవడం ఇద్దరికీ దుర్భరంగా తోచేది. భార్యాభర్తల మధ్య ఈ పరిస్థితేమిటి? ఎవరికైనా తెలిస్తే నవ్వుకోరా! అన్న ఆలోచన వచ్చినా ఎవరికి వారు సమర్థించుకునేవారు. అందులో తప్పున్నా దాన్ని దిద్దుకోవల్సింది తను మాత్రం కాదని ఒకరి మీద మరొకరు నెట్టుకునేవారు.
ప్రియతమ్ గీసి గీసి లెక్కలేసి సుందరికి డబ్బులివ్వడం, సుందరి తెల్లారి లేచి నాన్చి నాన్చి పనులు చేయడం– ఇదీ తంతు! ఎప్పుడైనా పక్కింటివాళ్లతోనో, ఇంటికొచ్చిన అయినవాళ్లతోనో తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సివచ్చినా, వీళ్ల బండారం బయట పడిపోకుండా ముఖాన పౌడర్లు స్నోలతో పాటు లేని నవ్వులు కూడా తగిలించుకునేవారు. దేవాలయంలో పురాణ కాలక్షేపం జరుగుతోందని, స్వామివారు చెప్పే పురాణం కన్నా ఇంటింటి రామాయణం మీద జోకులే అందరికీ కనెక్ట్ అవుతున్నాయని వీధిలో నలుగురూ అనుకోసాగారు. ఓ సాయంత్రం పక్కింటి వాళ్లు వెళ్తుంటే ప్రియతమ్, సుందరి వాళ్లతో వెళ్లాల్సి వచ్చింది. నవ్వలేనివారు స్వర్గాన ఉన్నా ఏడుపు మొగంతోనే ఉంటారన్నట్లు, కనీసం ఇంగ్లీషు సినిమాహాల్‌లోలా, పక్కవారితో జతకలిపైనా నవ్వకుండా ప్రియతమ్, సుందరి గంభీర వదనాలతో ఉన్నారు.
‘‘మనిషి సంఘజీవి. ఒకరితో ఒకరు కలిసుండాలి. ఇందులో అనుమానమే లేదు. అలాగని ఒకరు లేకపోతే మరొకరు బతకలేరు అని కాదు, ఒకరికొకరుగా కలసి ఉంటూనే ఎవరి వ్యక్తిత్వం వారు చాటుకోవాలి. ఎవరి అస్తిత్వం వారు నాటుకోవాలి. ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే కదా ప్రేమలు, అభిమానాలు పుడతాయి; బంధాలు బలపడతాయి. అప్పుడే కదా ఈ సమాజమే అందంగా ఉంటుంది. అందం అంటే– నేను చెప్పే అందం, మీరు చూసే అందం ఒకటి కాదు. విశ్వమానవ కళ్యాణంలోని అందాన్ని, వసుధైక కుటుంబంలోని బంధాన్ని నేను చూస్తున్నాను’’ భక్తులంతా గొప్ప ఊరటని, ప్రశాంతతను పొందిన అనుభూతితో తేలిపోయారు. అంతటి ఆనందాన్ని తట్టుకోలేని కొందరి గుండెలు ఉప్పొంగిపోగా కళ్లవెంట జలజలా ఆనందబాష్పాలు రాలాయి.
స్వామివారు ఆ రోజుకి స్వస్తి చెప్పి లేవగానే భక్తజనం కూడా ఎవరిళ్లకు వారు వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు.ప్రియతమ్, సుందరి మనసులపై స్వామివారి కొన్ని మాటలు బలమైన ముద్ర వేశాయి. ‘‘..ఎవరి వ్యక్తిత్వం వారు చాటుకోవాలి. ఎవరి అస్తిత్వం వారు నాటుకోవాలి’’ ఈ మాటలు పదే పదే వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.స్వామివారి మాటల్లోని పూర్తి సారాంశాన్ని తీసుకోకుండా, తమకు కావల్సింది మాత్రమే పట్టుకొని రాత్రి పడుకున్నాక కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయారు. ఆఫీసుకు రెడీ అవుతున్న ప్రియతమ్ మనసులో పరిపరి విధాలా ఆలోచనలతో హాల్‌లో నిల్చున్నాడు క్యారియర్ కోసం. సుందరి ఇంతకీ రాదు, అంతకీ రాదు. అసహనం పెరిగిపోసాగింది. పోనీ ‘దీని కేరీజు ఎవడికి కావాలి బయట ఏదోటి తిందాం’ అనుకుంటే ఆ మసాలాలు, బిరియానీలు తన ఒంటికి పడవు. ఏదైనా హోమ్లీగా ఉండాలి. ఈ బలహీనతే దానికి బలమైన ఆయుధమైపోయింది. ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాడు.
సర్దిన క్యారియర్ యథాలాపంగా అతని చేతికిచ్చి మాటామంతి లేకుండా అక్కడే నిల్చుంది. ప్రియతమ్ అడుగుతీసి బయటపెట్టాక గేటు తలుపులు వేయడానికి వెళ్లి అక్కడ అడిగింది‘‘ఖర్చులకు డబ్బులివ్వలేదేం?’’అనిఏవేవో లెక్కలు వేసుకొని, జేబులోంచి పర్సు తీసి ఒకటికి నాలుగుసార్లు లెక్కపెట్టినవే లెక్కపెట్టి సుందరికిచ్చి బండి స్టార్ట్ చేశాడు.గేటు వేసొచ్చి సోఫాలో కూర్చుంది. ‘ఇలా గానుగెద్దులా పడుంటే, చేసి పెడుతుంటే తన విలువేంటో ఆయనకు తెలీట్లేదు. స్వామివారు చెప్పినట్టు ఎవరూ ఎవరికీ తీసిపోయి లేరు. నా వ్యక్తిత్వాన్ని నేనే కాపాడుకోవాలి. బానిస బతుకు బతకడంలో అర్థం లేదు’ అని ఒకటికి పదిసార్లు అనుకుంది.చూస్తుండగానే సాయంత్రమైంది. ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగివస్తున్న ప్రియతమ్ తన వీధిలో రెండిళ్లు దాటీ దాటగానే ఠక్కున అతని స్కూటర్ ఆగిపోయింది.
ఎదురుగా కొత్తగా వెలసిన టిఫిన్స్ కొట్టు ‘మీ వంటిల్లు’ కనిపించింది. ‘పేరు కూడా భలే ఉందే’ అనుకుంటూ బండి స్టాండ్ వేసి లోపలికెళ్లాడు. నేతి ఘుమఘుమలతో టిఫిన్లు కూడా అరటాకులో తింటున్న కస్టమర్లతో హోమ్లీగా కనిపించింది. సీరియల్ లైట్ల వెలుగు జిలుగుల్లో తనపాలిట కల్పతరువుగా కనిపించింది. తిన్నగా ఇంటికి పోనిచ్చి బండి పార్క్ చేసి లోపలికి వెళ్లాడు.ప్రియతమ్ వచ్చాక ముందు మంచినీళ్లు, తర్వాత టీ కప్పు అందివ్వడం సుందరి చేసే పని.ఆ వేళ అలాంటిదేమీ జరగలేదు. ప్రియతమ్ ఫ్రెష్ అవడానికి వాష్‌రూమ్‌లోకి దూరాడు. కాస్సేపటికి హాల్లోకి వచ్చిన ప్రియతమ్‌కు చేష్టలుడిగినదాన్లా సోఫాలో సుందరి కనిపించింది. ఆమె టీ పెట్టి తీసుకురాలేదు. అతను అడగలేదు.‘తను నోరిడిచి అడగనిది నేనెందుకు ఇవ్వాలి. ఉదయం ఆఫీసుకు వెళ్తూ ఆ రోజు ఇంటి ఖర్చులకు నేనడగకుండా డబ్బులిచ్చాడా? లేదుకదా! గేటు వరకు వెళ్లినతని వెనకే వెళ్లి అడిగితే వీధిలోనే నిలబడి ఆరవైఆరు లెక్కలేసి డబ్బులు చేతిలో పెట్టాడు. కావల్సినవి కొని అన్నీ చేసేసరికి పైసా మిగల్లేదు.
ఏమిటీ అవస్థ? ఇంతోటి భాగ్యానికి తనెందుకు పులుముకొని కడుక్కోవడం’ పేపరు చూస్తూ తన ఆలోచనల్లో తనుంది.ప్రియతమ్ డ్రెసప్ అయ్యాడు. చెప్పులు వేసుకొని లుంగీతోనే వీధిలోకి వెళ్లిపోయాడు. సుందరిలో ఒక్క నిముషం ఆశ్చర్యం. అంతలోనే సర్దుకొని తన పనిలో తను పడింది.‘అదేం పేదరాసి పెద్దమ్మ అనుకుంటుందేమో! దాని పుంజు కుయ్యకపోతే కప్పుటీ ఎక్కడా దొరకదనుకుంటుందేమో! రెండడుగులు వేస్తే అద్భుతమైన దుకాణం ఉందిప్పుడు. దానికా సంగతి తెలీదేమో! ఇంతకు ముందు రెండు వీధులు దాటి రోడ్డుకు వెళ్తేకాని టీ కాఫీ ఫలహారాలు కనపడేవి కావు. అవి కూడా మనకి కావల్సినట్లు ఉండేవి కావు. అయినా అంతదూరం ఎవడెళ్తాడ్రా బాబూ అనుకుంటూ ఇంట్లోనే దేవులాడాల్సి వచ్చేది.
కొత్త దుకాణం ఆ బాధలన్నీ తీర్చింది’ అనుకుంటూ ఓ టీ కొనుక్కొని ఆక్కడే కాస్సేపు గడిపి ఏ టైమ్‌లో ఏయే వస్తువులు ఉంటాయో తెల్సుకొని ఆనందంగా ఇంటికొచ్చాడు.‘ఏమిటీ మనిషి? ఇంటికొచ్చిన వెంటనే టీ చుక్క పడకపోతే పిచ్చెక్కిపోయేవాడు. అలాంటి చిహ్నాలేవీ లేకుండా హుషారుగా కనిపిస్తున్నాడు’ అనుకొని వంటగదిలోకి వెళ్లి తన పనిలో పడింది.భోజనాల వేళైంది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ‘‘భోజనం రెడీ’’ అంది సుందరి.‘ఏమిటి! హోటల్ ముందు బోర్డు పెట్టినదాన్లా ‘భోజనం రెడీ ఏంటి. భోంచేద్దురుగాని రండి అంటే దాని సొమ్మేమైనా పోతుందా? నా సొమ్మేగా! అయినా దానికి టీ తాగే అలవాటు లేదు. అందుకే అడిగితే కాని ఇవ్వట్లేదు. కాని, తిండి తినాలిగా. అందుకే నన్నూ పిలిచిందన్నమాట. ఏదైతేనేం, వద్దని పస్తుండలేం కదా’ అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు.
అందని అందాల అంచుకే చేరిననూ.. విరిసిన పరువాల లోతులే చూసిననూ.. తనివి తీరలేదే’’ పాట టీవీలో వస్తోంది. విసురుగా లేచి వెళ్లి టీవి కట్టేశాడు ప్రియతమ్. భోజనం ముగించి బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.పనులన్నీ ముగించుకొని సుందరి కూడా వెళ్లి పడుకుంది.‘ఏవిటీ అవస్థ? ఇంతకు ముందు మొక్కుబడిౖకైనా తమ మధ్య పొడి పొడి మాటలుండేవి. ముఖాన గంటు పెట్టుకొని పడుండేవాళ్లం కాము. ప్రవచనం దగ్గరకు వెళ్లొచ్చాక ఇద్దరిలోనూ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఉన్న సంకోచాలు పోయి లేని తెగింపులు పుడుతున్నాయేంటి! ఇది ఎక్కడకి దారి తీస్తుంది? తెగని ఆలోచనలతో సుందరి ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో ఏమో!
తెల్లవారింది. ఎవరి పనుల్లో వారున్నారు. ప్రియతమ్‌కు బెడ్ టీ అలవాటు. అలాగని నిద్రకళ్లతో, పాచిమొఖంతో తాగడు. నిద్రలేచి, వాష్‌రూమ్ అవసరాలు తీర్చుకొని బ్రష్ చేసి హాల్‌లో కూర్చొని పేపర్ చూస్తు ఉన్నవాడికి సుందరి టీ తెచ్చి ఇస్తుంది. అది లేటయితే అతనిలో అసహనం అంతకంతకు పెరుగుతుంటుంది. నిరసనను ఏదోరకంగా వ్యక్తం చేసేవాడు. అప్పటికీ ఆలస్యమైతే ‘‘లోపల ఏం వెలగబెడుతున్నావ్. టీ తెస్తున్నావా లేదా?’’అని అరిచేవాడు.
ఈవేళ హాల్‌లోకి ప్రియతమ్ వచ్చాడు. కానీ టీ రాలేదు.‘మనిషొచ్చాడు. కానీ రంకె వేయలేదేంటి? చూద్దాం. ఏం చేస్తాడో. నిన్న సాయంత్రం పెద్ద ఫోజుగా బయటికెళ్లి పోయాడుగా’ అనుకుంటూ వంటగదిలోనే ఉంది సుందరి.ప్రియతమ్ సోఫా మీదున్న న్యూస్ పేపర్ తీశాడు. నిల్చొనే పేజీలు తిరగేస్తూ హెడ్‌లైన్స్ ్స ఒకసారి చూశాడు. టీ కోసం ఎదురు చూసినవాడిలా కనిపించకుండా చెప్పులు వేసుకొని లుంగీలోనే రోడ్డుకు వెళ్లిపోయాడు.సుందరి చిన్నపాటి కుదుపుకి లోనయింది. ‘ఏవిటీ మనిషి! ఉలకాయిస్తున్నాడా నన్ను? ఉలకాయించనీ. ఉలకాయించిన మొగుడ్ని ఉడతెత్తుకు పోయిందని.. ఎన్నాళ్లు ఉలకాయిస్తాడో నేనూ చూస్తాను’ అనుకుంటూ పనిలో పడింది.కాస్సేపటికి వచ్చిన ప్రియతమ్ సరాసరి వాష్‌రూమ్‌లోకి దూరిపోయాడు. మరి కాస్సేపటికి డ్రసెప్పై హాల్‌లోకి వచ్చాడు.
సుందరి క్యారియర్ కట్టీసి అతను చూస్తుండగా టేబుల్ మీద పెట్టింది.ప్రియతమ్ పర్సులోంచి డబ్బులు చేతికొచ్చింది వచ్చినట్లు తీసి టేబుల్ మీద పెట్టాడు. అవి సరిపోతాయా చాలవా ఆన్న ఆలోచన ఆ సమయంలో అతనికి కలగలేదు.ప్రియతమ్ వెళ్లిపోయినా చాలాసేపు అలా సోఫాలో కూర్చుండిపోయిన సుందరి బలవంతంగా ఆలోచనల్ని మళ్లించడం కోసం యథాలాపంగా న్యూస్‌పేపర్ చేతిలోకి తీసుకొని తిరగేస్తూ చటుక్కున ఓ వార్త దగ్గర ఆగిపోయింది. ఆసక్తిగా వార్తను సాంతం చదివింది. ఆ తర్వాత తనకు స్పష్టమైన ఓ దారి, గమ్యం కనిపించినంత ఆనందంగా లేచింది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన ప్రియతమ్ కంగుతిన్నాడు. ఇంటికి తాళం వేసుంది. దానికో చీటీ తగిలించి ఉంది.
‘తాళాలు పక్కింటి ఆంటీవాళ్ల దగ్గరున్నాయి’ అని రాసుంది దానిమీద. ఎప్పుడూ జరగలేదిలా. ఆశ్చర్యపోతూనే వెళ్లి తాళాలు తెచ్చి తలుపులు తెరిచాడు. హాల్‌లో లైటు వేయగానే టేబిల్ మీద చిన్నసైజు లెటర్ కనిపించింది. ‘‘నేనెక్కడికి వెళ్లానా అని ఆలోచించకండి. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను అడుగుతీసి అడుగెయ్యలేననే కదా మీ ధైర్యం. నేను కుక్కిన పేనులా పడుంటాననే కదా మీ నమ్మకం. నాలాంటి వాళ్లకు మంచి రోజులు వచ్చాయి. ఆర్టీసి బస్సుల్లో మా ఇష్టం వచ్చిన చోటుకు మా ఇష్టం వచ్చినట్లు తిరిగే స్వేచ్ఛ లభించింది. నా కోసం వెతకొద్దు’’అదీ మ్యాటర్. ప్రియతమ్ లిప్తపాటు ఉక్కిరిబిక్కిరయ్యాడు. అంతలోనే సర్దుకున్నాడు. ‘సరే. ఆ ముచ్చట కూడా చూద్దాం.
అది లేకపోతే నాకు తిండి దొరకదా ఏంటి. ఎలా వెళ్లింది అలాగే వస్తుందిలే. రాకపోయినా వచ్చిన నష్టం లేదు హోమ్లీ హోటలుంది’ అని తనకు తాను చెప్పుకొని శుభ్రంగా ఫ్రెష్ అయి లుంగీలోనే రోడ్డు మీదకు వెళ్లాడు. కొత్త కొట్టు దగ్గరకి వెళ్లాడు. వేడి వేడిగా ఓ సమోసా తిన్నాడు. ఆనక ఓ స్పెషల్ టీ తాగాడు. అక్కడ మంత్లీ కార్డు సిస్టమ్ కూడా ఉందని తెలుసుకొని డబ్బు కట్టేశాడు. ఉదయం టీ తాగడానికి వెళ్లినప్పుడు క్యారియర్ ఇచ్చేస్తే ఆఫీసుకు బయల్దేరే సమయానికి మంచి భోజనంతో క్యారియర్ రెడీ చేస్తారంట! ‘తంతే భోజనశాలలో పడ్డాం’ అనుకుంటూ తనలో తను నవ్వుకుంటూ ఇంటికొచ్చాడు. కాస్సేపు ఇలా అలా గడిపేసి డిన్నర్ టైమ్ కాగానే మళ్లీ కొత్తకొట్టుకు వెళ్లి తృప్తిగా భోజనం చేసేసి వస్తూ వస్తూ దార్లో ఓ మిఠాయి కిళ్లీ కూడా కట్టించుకొని వేసుకొని డర్రుమని ఓ తేనుపు తీసి ఇంటికొచ్చి నడుం వాల్చీ వాల్చగానే హాయిగా నిద్రలోకి వెళ్లిపోయాడు.
∙∙
ఆ రోజు ఉదయం ప్రియతమ్ ఆఫీసుకు వెళ్లగానే పేపరు చదువుతున్నది ‘ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ్టి నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. సిటీలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఎన్ని సార్లయినా వాళ్లు స్వేచ్ఛగా ప్రయాణించ వచ్చు’ అన్న వార్త చదివి ఎగిరి గంతేసింది. ఇక క్షణం కూడా నిలవలేక పోయింది. గబగబ పనులన్నీ ముగించుకొని చిన్న సంచిలో ఓ రవిక జాకెట్టు పెట్టుకొని ఇంటికి తాళం వేసి, దాని చెవి పక్కింటాంటీకి ఇచ్చి, రోడ్డు మీదకు వెళ్లీ వెళ్లగానే బస్సు. వెనకా ముందు చూడకుండా ఎక్కీసింది.
అప్పుడు ఉదయం 11. భరత్‌నగర్ దగ్గర సుందరి ఎక్కిన బస్సు అనేక స్టాపుల్లో ఆగుతూ దిల్‌షుక్ నగర్ మీదుగా వెళ్తోంది. దిల్‌షుక్ నగర్‌లో సాయిబాబా మందిరం గుర్తొచ్చి ఒక్కసారి ఒళ్లు పులకరించింది.
మరో ఆలోచన లేకుండా అక్కడ దిగేసింది. ఎప్పటినుంచో దాచుకున్న వందో నూటయాభయ్యో రూపాయల్ని ఎందుకైనా మంచిదని పట్టుకొంది. బాగా దాహమేసి గొంతెండిపోతుంటే ముందు ఓ సోడా తాగింది. చాలా ఆనందమేసింది. గోలీ సోడాతో దాహం తీరినందుకు కాదు, స్వతంత్రంగా ఓ సోడా కొనుక్కోగలిగినందుకు. తర్వాత బాబాను దర్శించుకుంది. ఈలోగా ఉచిత భోజన వితరణ వేళయింది. ‘ఏమి నా భాగ్యం’ అనుకుంటూ బాబా ప్రసాదం ఆరగించింది. కొద్దిసేపు మందిరమంతా కలియతిరిగి అక్కడి నుంచి మెహిదీపట్నం వెళ్లే బస్సు ఎక్కీసింది. అక్కడ బస్సు మారి చిలుకూరు వెళ్లింది. బాలాజీని దర్శించుకొని తిరిగి మెహిదీపట్నం వచ్చింది.
పెద్దపెద్ద స్తంభాల మీద వంకీలు తిరిగున్న బ్రిడ్జిని, స్తంభాల మధ్యనుంచి రాకపోకలు సాగించే బస్సులు, కార్లు, స్కూటర్లను ఎప్పుడూ చూడని అందాలను తనివితీరా సంతోషంగా చూసి తర్వాత కూకట్‌పల్లి వెళ్లే బస్సు ఎక్కి తాము ప్రవచనం విన్న గుడికి చేరింది. స్వామివారు ప్రవచనం ముగించినట్లున్నారు భక్తులెవరూ లేరు. తను వెళ్లి దేవుడ్ని దర్శించుకొని దేవాలయంలో ఓ మూల కూర్చొంది. కాస్సేపటికి పూజాదికాలు ముగించి మంగళహారతులిచ్చేసి గుడి తలుపులు వేసేసి వచ్చిన పూజారికి ఓ మూల కూర్చున్న సుందరి కనిపించింది. ‘‘ఎవరమ్మా నువ్వు. గుడి తలుపులు కూడా వేసేశాం. చూసుకో లేదా. నువ్వు ఇక్కడే ఉండిపోయావు’’ అన్నారు.
‘‘లేదు స్వామీ. ఈ రోజు నేనిక్కడే ఉందామనుకుంటున్నాను. దూరం నుంచి వచ్చాను’’అంది సుందరి‘‘అలాగా! అయితే భక్తుల విశ్రాంతి మందిరం ఉంది. అక్కడుండమ్మా!’’ అన్నారు.అలా అక్కడ ఆశ్రయం పొందిన సుందరి తెల్లవారే లేచి, అక్కడే కాలకృత్యాలు తీర్చుకొని, స్నానపానాలు కానిచ్చి దేవుని దర్శించుకొని బయటపడింది. ఆ రోజు కూడా తను చాలా చోట్లకు తిరిగి తిరిగి రాత్రికి మళ్లీ అక్కడికే చేరుకుంది.ప్రియతమ్‌కు బ్యాచిలర్ రోజులు గుర్తుకొస్తున్నాయి. ‘టైమ్‌కు అన్నీ అందితే, ఈ సంసారం అనే జంఝాటమెందుకు? బ్యాచిలర్ బతుకే సో బెటర్ అయితే ఫోర్స్‌డ్ బ్యాచిలర్ బతుకు సోమచ్ బెటర్’ అని రోజు రోజుకీ హుషారుగా ఉన్నాడే కానీ ‘కట్టుకున్నది ఇంటికి రాలేదు. ఎక్కడికెళ్లిందో, ఏమైపోయిందో ఏమిటో’ అని ఆమె మీద ధ్యాస గాని, ఆశ గాని లేకుండా గడిపేస్తున్నాడు.
ఇలా ఇద్దరూ ఒకరి నొకరు తలచుకోకుండా రెండు మూడు రోజులు గడిపేశారు. కాని, ఆ రోజు కథ అడ్డం తిరిగింది. విచిత్రంగా ఇద్దరి కొత్త జీవితం ఊహించని మలుపు తిరిగింది.ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న ప్రియతమ్ బండి ఒక్కసారి గాలి తీసినట్లు ఆగిపోయింది. కొత్తకొట్టు మూసేసి ఉంది. ఆ రోజు భోగి పండగ. సంక్రాంతికి వీధుల్లోని టీ, టిఫిన్స్ మీల్స్ దుకాణాలన్నీ బంద్ చేసి సొంతూళ్లకు వెళ్లిపోతారు. సాయంకాలాలు, పండువెన్నెలలు, పండుగలు పబ్బాలు లేకుండా అంగళ్లమీద ఆధారపడుతూ యాంత్రికంగా గడిపేవారికి ఆ మూడు రోజులు చెప్పరాని ఇబ్బందే! భోగి ముందు రోజు తను ఆఫీసులోనే ఉండిపోవల్సి వచ్చింది.
తనతోపాటు మరొ నలుగురైదురుకీ అదే పరిస్థితి. పెద్దపండగకి మెజార్టీ స్టాఫ్ సెలవులు పెట్టేయడంతో మిగిలినవారిమీద వర్క్ ప్రెజర్. డబుల్ డ్యూటీలు చేస్తేగాని పెండింగ్ అంతా క్లియర్ కాలేదు. ఆ హడావిడిలో హోటళ్ల సంగతే మరిచాడు ప్రియతమ్.డీలా పడిపోయి ఇంటికొస్తున్నవాడికి సుందరి గుర్తొచ్చింది.∙∙ సాయంత్రం వరకూ ఎక్కడెక్కడికో వెళ్లి అలవాటుపడ్డ గుడికి తిరిగొస్తున్న సుందరికి షాక్ తగిలింది. ఆలయ నిర్వాహకులు గుడిలోకి ఎవరినీ రానివ్వడం లేదు. లోపల ఉన్నవారిని వెతికి వెతికి బయటకు పంపించేస్తున్నారు. కొద్ది సేపట్లో చంద్రగహణం. అందుకే ఆలయం మూసేస్తున్నారు. సంప్రోక్షణం చేశాక మళ్లీ మర్నాటి వరకు ఆలయాన్ని తెరవరు. దర్శనాలు బంద్.
సాయంత్రం బస్సులో తిరిగొస్తున్నప్పుడు అందరూ అనుకుంటుంటే తెల్సింది.. ‘ఈ వేళ అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్’ అని. తమ డిమాండ్‌లు తీర్చకపోతే సమ్మెకు దిగుతామని కార్మికులు ఎప్పుడో నోటీసు ఇచ్చారట! షరా మామూలుగా ప్రభుత్వం నాన్చి నాన్చి సంక్రాంతికి బస్సు సర్వీసులు లేకపోతే జనాగ్రహాన్ని చూడాల్సి వస్తుందని కార్మిక నాయకులతో చర్చలు మొదలుపెట్టిందట! ఆ చర్చలు మరో గంటో ఘడియలో సక్సెస్ అయితే సమ్మె ఉండదు. చర్చలు విఫలమైతే? ఏం పర్వాలేదులే, నేను నమ్ముకున్న దేవుడి గుడి ఉందిగా అని ధీమాపడ్డ సుందరికి చెంపదెబ్బ గోడదెబ్బలాగ గుడి, బస్సుల సంగతి తెల్సి నవనాడులు కుంగిపోయాయి.
అక్కడే ఓ మూల గుడి స్తంభానికి జేరబడి కూలబడిపోయిన సుందరికి ప్రియతమ్ గుర్తొచ్చాడు.
అందర్నీ పంపేస్తూ సుందరి దగ్గరికి వచ్చిన స్వామివారు, ‘‘అదేంటమ్మా. నువ్వింకా ఇక్కడే ఉన్నావు. తలుపులు వేసేస్తారు. వెళ్లిపో’’ అంటూ ఆమె కళ్లలోకి చూసి అవాక్కయ్యారు. సుందరి కళ్లల్లో నీటిపొరను చూసి విచలితులయ్యారు. ఏమైందో అడిగి అంతా తెల్సుకున్నారు. ‘‘ఇదేంటమ్మా. ఇలాగేనా కాపురాలు చెయ్యడం. నీ సంసారాన్ని నువ్వే చక్కదిద్దుకోవాలి కదా. నీ తెలివితేటలు ఏమయ్యాయి? మీ ఆయన ఫోన్స్ నంబరు చెప్పు’’ అనేసరికి తడిగొంతుతో నంబరు చెప్పింది.కాస్సేపట్లోనే గుడిదగ్గరికొచ్చిన ప్రియతమ్ సుందరిని చూసి అలా ఉండిపోయాడు కాని, దగ్గరికి వెళ్లలేదు. సుందరి కూడా ఒకడుగు వేయబోయి ఆగిపోయింది. వీళ్లవస్థ చూసిన స్వామివారు ‘‘బాగుంది మీ వాలకం. ఇంత దూరం వచ్చినవాడివి దగ్గరకు రాలేవా? ఏమ్మా ఆయన వెనక ఏడడుగులు నడిచినదానివి ఒక్కడుగుతో ఆగిపోయావేం! మీకు మీరే గొప్ప అని ఎవరికి వారు అనుకుంటూ బంగారంలాంటి బంధాన్ని పాడుచేసుకుంటున్నారు. బంధమనేది ఉల్లిపాయ చందంలా పొరలు పొరలుగా బలపడాలి.
వద్దనుకొని కట్ చేసుకుంటే కన్నీళ్లే వస్తాయి. పెట్రోల్ పడ్డ దగ్గర అగ్గిపుల్ల పడ్డట్టు కాకుండా పప్పు వొలికిన చోట నెయ్యి వొలికినట్లుగా కాపురం సాగాలి’’ అని ఇద్దరి చేతులు కలిపేసి తలుపేసేశారు.దగ్గరి కొచ్చిన సుందరి ఏదో అపరాధభావంతో తలొంచుకొని ఉండిపోయింది. ప్రియతమ్ ఆమె భుజాలపై చేయి వేసి ధైర్యం చెబుతున్నవాడిలా దగ్గరికి తీసుకున్నాడు. బండి స్టార్ట్ చేసి కనిపించిన గతుకుల్ని తప్పించుకుంటూ స్మూత్‌గా డ్రైవ్ చేసుకొని వెళ్తుంటే..‘‘సుందరి నీవంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదుకదా.. నీ అందచందాలింక నావె కదా’’ అన్న పాట దూరం నుంచి మైకులో వినపడుతోంది.పాట వింటూ సుందరి ప్రియతమ్‌ను గట్టిగా పట్టుకొని అల్లుకుపోయింది.
∙