అడవి మొక్క | Adavi Mokkalu | Sakshi
Sakshi News home page

అడవి మొక్క

Published Sun, Oct 6 2024 8:31 AM | Last Updated on Sun, Oct 6 2024 10:03 AM

Adavi Mokkalu

శిశిరానికి ఆకులు రాలుస్తున్న ఒక పెద్ద వేపచెట్టు మొదట్లో గోధుమ రంగు ప్లాస్టిక్‌ పైపు పెట్టి నీళ్ళు పడుతోంది కరుణ. రెండు చేతులకు చెరొక రెండు డజన్ల గాజులు వేసుకుని, పడమటి ఎండ మొహం మీద పడుతుంటే, చీర తడిసిపోకుండా సర్దుకుంటూ, మొక్కలకు నీళ్ళు పడుతోందామె. ఓ వైపు మొత్తం కొత్త పూల కుండీలు, మరోపక్క కాయగూరల పాదులు, మరోపక్క వేప, మామిడి చెట్లు.. మధ్యలో రెండు చిన్న గదులతో డాబా ఇల్లు.‘విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం.. ఈ మూడు జిల్లాల్లో ఇంత అందమైన ఇల్లు మరొకటి లేదు. ఏమంటావ్‌’ అంటాడు కుమార్‌ ఆమెతో. ‘అవునవును’ అని భర్త వైపు అంగీకారంగా చూస్తూ నవ్వుతుంది కరుణ.

కుమార్‌ విశాఖపట్నంలో టూరిస్ట్‌ ఆపరేటర్‌గా పని చేస్తూ ఉంటాడు. ఉత్తరాంధ్రలోని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులను తన ట్వంటీఫైవ్‌ సీటర్‌ వ్యాన్‌లో తీసుకెళ్ళి వస్తూ వుంటాడు. వారంలో నాలుగైదు రోజులు ఉండడు. విశాఖపట్నంలో కాపురం పెట్టేంత స్తోమత లేక కాశీబుగ్గలో పెట్టాడు. భార్య సిటీ మాట ఎత్తకుండా ఇలా ఇంటిని పొగుడుతుంటాడు. ఉన్న దాంట్లో సంసారాన్ని సర్దడానికి, తనని సంతోష పెట్టడానికి భర్త పడే ఆపసోపాలు గుర్తొచ్చి నవ్వుకుంది కరుణ. ఫోన్‌ చేయాలని బలంగా అనిపించింది. టూర్‌లో ఉన్నప్పుడు సాధారణంగా చేయదు.. ఏ బిజీలో ఉంటాడోనని. కాని ఇవాళ తప్పేలా లేదు. పొట్ట నిమురుకుంది. నాలుగురోజులుగా అనుమానంగా ఉంటే ఉదయం కిట్‌ తెచ్చుకుని టెస్ట్‌ చేసుకుంది. అవును. తమ తోటలోకి దోగాడే చిట్టిపాదాలు రానున్నాయి.

భర్తకు ఫోన్‌ చేసింది. కలవలేదు. అయితే ఆ సమయానికి కుమార్‌ చాలా ఆందోళనగా ఉన్నాడని ఆమెకు తెలియదు. కాంబాలకొండ అడవుల మధ్యలో గుడారాలలో నైట్‌ క్యాంపు ముందురోజు రాత్రే ముగిసింది. ఎప్పటిలాగే క్యాంపుకని 25 మంది యువ పర్యాటకులను తీసుకుని వెళ్ళాడు. అందమైన కటికి జలపాతం చేరుకోవడానికి చేసిన ట్రెక్కింగ్, బొర్రాగుహలలో సందడి, అరకు ట్రైబల్‌ మ్యూజియం.. ఇలా ట్రిప్‌ మొత్తం సరదాగా పూర్తి చేసుకుని నైట్‌ క్యాంపుకు వచ్చేశారు. అంతా బాగా సాగింది. ఉదయం 6 గంటలకు తిరుగు ప్రయాణం అని చెప్పాడు కుమార్‌. తెల్లవారి అందరూ రెడీ అయ్యి వ్యాన్‌ దగ్గరకు వచ్చేశారు. లెక్క చూసుకుంటే ఒక అమ్మాయి కనపడలేదు. ఆ అమ్మాయి ట్రిప్పుకి కూడా ఒంటరిగా వచ్చింది.

 బ్యాగు, చెప్పులు, ఫోను అన్నీ ఆమె టెన్టులో వున్నాయి కాని ఆమె అక్కడ లేదు. కుమార్‌ దగ్గర వున్న లిస్టులో ఆమె పేరు ‘షర్కియా’ అని వుంది. ఇతర వివరాలు ఏమీ ఉండకపోవడంతో ఫోను చేశాడు. ఫోను టెంట్‌లో నుంచే మోగుతోంది. అందరూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఏదైనా వాక్‌కి లేదా  ఫొటోల కోసం వెళ్ళిందేమో అని మాట్లాడుకుంటున్నారు. కొందరు ‘షర్కియా గారూ’ అంటూ గాలించడం మొదలు పెట్టారు.  ఆమెతో రెండు రోజుల నుండి కలసి ప్రయాణం చేసిన ఇద్దరు యువతులు ముందుకు వచ్చి ‘ఆ అమ్మాయి కాకినాడ నుండి వచ్చాను అని చెప్పింది. 

ఈ అడవికి చాలాసార్లు వచ్చాను కానీ రాత్రి క్యాంపు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పింది. ఆమెకు ఒక చేయి లేదు. ఉన్నది కృత్రిమ చేయి. గ్లౌసు తీసే వరకు మేము కూడా గమనించలేదు’ అని తెల్సిన సమాచారం ఇచ్చారు. 
సమయం పదిన్నర అయ్యింది. మిగతా టూరిస్ట్‌లలో విశాఖపట్నం నుండి విమానం ఎక్కాల్సిన వారు వున్నారు. వారికి ఆలస్యం అవుతోంది. కొందరు కాలేజీ పిల్లలు ‘ఇంట్లో రెండు రోజుల ట్రిప్‌ అని చెప్పి వచ్చాము ఆలస్యం ఐతే ఇబ్బంది అవుతుంది’ అంటూ కుమార్‌తో చెబుతున్నారు.

పరిస్థితి కాంప్లికేట్‌ అవుతోంది అని అర్థం అయింది కుమార్‌కి. తప్పక ఒక  నిర్ణయం తీసుకోవాలి. మిస్‌ అయిన అమ్మాయి కోసం తాను ఆగిపోయి అందరినీ వేరే బస్‌ మాట్లాడి వారికి క్షమాపణలు చెప్పి విశాఖపట్నం పంపించాడు. అన్నీ పోను మిగిలే పది వేలు.. ఇపుడా డబ్బు కూడా బస్‌కి ఇచ్చేయాలి. కానీ తప్పదు. పొద్దున పదకొండు కావొస్తోంది. క్యాంపుకు దగ్గరలోనే చెక్‌పోస్టులో ఉన్న ఫారెస్ట్‌ గార్డ్‌లకు విషయం తెలిసింది. అమ్మాయి నాలుగు గంటల నుండి కనపడటం లేదు అనగానే వారికి కూడా భయం మొదలు అయింది. వయసులో వున్న ఆడపిల్ల, అడవిలో నుండి టింబర్‌ డిపోకు వెళ్ళే లారీలు చాలానే ఉంటాయి. ఏ లారీవాడు ఆపి తీసుకెళ్ళి పోయినా చేయగలిగేది ఏమీ లేదు. భయం అంతకంతకూ పెరిగిపోతోంది. 

అమ్మాయి ఫోనుకి ఎవరైనా ఫోను చేస్తారేమో వివరాలు తెలుస్తాయి అని గార్డ్‌లు ఆమె ఫోను చేతుల్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ‘పదండి వెతుకుదాం’ అని అడవి దారి పట్టారు. సూర్యుడు మొహం మీద నుండి మాడు మీదకు వచ్చి తాండవం చేయడానికి సిద్ధం ఐపోతున్నాడు. చుట్టూ నిశ్శబ్దం. వెతుకుతూనే వున్నారు. పన్నెండు అవుతూ ఉండగా వారంతా ఒక కొండ ఎక్కి దిగేశారు.. సెలయేరు చప్పుడు గట్టిగా దగ్గరగా వినపడుతోంది.. ఆ అమ్మాయి ఏమైనా కిందకి దిగిందేమో అని ఆశగా చూశారు.

 చుట్టూ ఊబి గుంటలు వుండే సెలయేరు కావడంతో ఎవరూ అటుగా వెళ్లరు. అటువంటిది ఆ సెలయేరుకి అవతలి గట్టు మీద నీలిరంగు దుస్తుల ఆకారం ఉన్నట్టు కనిపించింది. గబగబ దిగి అటువైపుగా అడుగులు వేశారు. దగ్గరకి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఒక ఊబి గుంటలో కాళ్లు దిగబడి కనిపించింది. వీరి అలికిడికి ‘ఇక్కడున్నాను.. ఇక్కడా’ అని అరిచింది. నీటి మధ్యలో బండరాళ్ళు వున్నాయి. పుస్తకం, పెన్ను,  కృత్రిమ చేయిని బండరాయి మీద విడిచి అవతలి ఒడ్డుకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఊబిలో చిక్కుకున్నట్టు పరిసరాలు చూస్తే అర్థం అవుతోంది. ఆ అమ్మాయికి ఏమీ కాలేదని అర్థమైన కుమార్‌కు ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది.  

‘ఏమ్మా ఇక్కడకి ఎందుకు వచ్చారు.. మీ సరదాలు మా చావుకి వస్తాయమ్మా. చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు.. ఎందుకు ఇక్కడకి వచ్చావు. అసలెలా ఊబిలో ఇరుక్కున్నావు’ అని కోపంగా అడిగేశాడు. ఈలోపు గార్డులు ఆమెను బయటకు లాగారు. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉంది. అప్పటికి కుమార్‌ కోపం తగ్గింది. గట్టిగా తిట్టానా అనుకున్నాడు. ఆ అమ్మాయి కోలుకుని–‘ఈ అడవి నాకు కొత్త కాదు. నేను ఇదే అడవిలో పుట్టి పెరిగాను. మా అమ్మ నాన్న నక్సలైట్స్‌. నాకు పన్నెండేళ్లు వుండగా నా కళ్ళ ముందే మా అమ్మను చంపేశారు పోలీసులు. మా అమ్మ ఇదిగో ఇదే చోట సమాధి అయ్యింది. ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు.. మా నాన్న ఇక్కడకు వస్తాడనే ఆశతో వచ్చాను. కాని ఆయన బతికి ఉన్నాడో లేదో కూడా తెలియడం లేదు’ అంది.

గార్డ్‌లు అలర్ట్‌ అయ్యారు.‘అమ్మ చనిపోయాక మా నాన్న ఒక విలేఖరి సహాయంతో నన్ను రంపచోడవరంలో ప్రభుత్వ హాస్టలుకు పంపించాడు. ఆ విలేఖరి రెండేళ్ల తర్వాత నన్ను అమ్మేయాలని చూశాడు. వ్యభిచార గృహం నుండి తప్పించుకునే ప్రయత్నంలో నా చేయి కోల్పోయాను. కాకినాడలో మూలికా వైద్యం చేస్తూ బతుకుతున్నాను. చిన్నప్పుడు అడవిలో మా నాన్న నేర్పాడు. తర్వాత ఆసక్తి కొద్ది నేర్చుకున్నాను. ఇన్నాళ్ల తర్వాత ఇక్కడకు వచ్చాను. ఒక కొత్త రకం మొక్కను గమనిస్తూ పొరబాటున ఊబిలో ఇరుక్కుపోయాను..’
కుమార్‌కి ఒక నిమిషం జాలి వేసింది. 

ఇంతలో చెక్‌పోస్ట్‌ దగ్గరికి పోలీస్‌ జీప్‌ చేరుకున్నట్టు ఫోన్‌ వచ్చింది. అప్పటికే అమ్మాయి వివరాలు గార్డులు పోలీసులకు చెప్పడంతో ‘ఆమెను స్టేషన్‌లో దించి మీరు వెళ్లండి’ అన్నారు కుమార్‌తో.‘అదెలా సార్‌. ఆమెను తిరిగి వైజాగ్‌లో దించడం నా బాధ్యత’ అన్నాడు కుమార్‌.‘ఏం కుమారూ.. ఈ పిల్లకి నీకు ఏమైనా వుందా ఏంటి? మేము చూసుకుంటాములే. నువ్వు బయలుదేరు’ అన్నాడు ఎస్‌.ఐ.ఎదురు మాట్లాడితే బతుకుతెరువు దెబ్బ తింటుంది. పోలీసుల హెల్ప్‌ లేకుండా ఫారెస్ట్‌లో టూరిస్ట్‌ క్యాంపులు చేయలేడు. ‘ఇదంతా మీరే తెచ్చుకున్నారు. సారీ’ అన్నాడు ఆ అమ్మాయితో స్టేషన్‌లో దిగబెట్టాక బయలుదేరుతూ.

‘పర్వాలేదు. నేను చూసుకుంటాను. మీరు వెళ్లండి’ అందా అమ్మాయి. తన దగ్గరున్న చిన్న నేత సంచిని ఇచ్చింది. ‘అడవి విత్తనాలు. ఇంట్లో వేసుకోండి. నా గిఫ్ట్‌’ అంది. సంచి చెమ్మగా ఉంది.ఆమె వైపే చూస్తూ స్టేషన్‌ నుంచి బయటపడ్డాడు. తెల్లవారుజామున ఇల్లు చేరుకున్న కుమార్‌కు నిద్ర కళ్లతో తలుపు తీసిన కరుణ జరిగింది విని మత్తు వదిలి కూచుంది.‘ఆ అమ్మాయి?’ అంది.‘ఏం చేస్తారో ఏమో, తెలుసుకోవాలన్నా భయంగా ఉంది’ అన్నాడు కుమార్‌.అతని టెన్షన్‌ చూసి చెప్పాలనుకున్న శుభవార్త చెప్పలేదు కరుణ. పొద్దున లేచాక భర్త లగేజీ నుంచి గింజల సంచిని తీసిన కరుణకు వాటిలోని రెండు మూడు గింజలకు చిన్నగా మొలకలు కనిపించాయి. వెంటనే ఇంట్లో ఖాళీగా వున్న కుండీలో పాతింది. 

రెండు రోజులు గడిచాయి.. మొలకలు వచ్చాయి. ఈలోపు పెద్ద తుఫాను అని ప్రకటన వచ్చింది. నాలుగైదు రోజుల పాటు కుంభ వృష్టి. ఈదురు గాలులకు ఎందరో ఇళ్ళు కోల్పోయారు. కరుణ, కుమార్‌ ఇంటికే పరిమితం అయ్యారు. తుఫాను ముగిశాక బయటికొచ్చి పరిశీలనగా చూసుకుంటే ఆ బీభత్సానికి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కల కొమ్మలు విరిగిపోయి, ఇంట్లో వున్న మామిడి వేపచెట్లు పక్కకి వాలి జీవం కోల్పోయి కనిపించాయి. కరుణ చాలా బాధపడింది. చనిపోయిన మొక్కలను తీసి పక్కన వేస్తుండగా తొట్టిలోని మొలకల్లో నుంచి ఒకటి మాత్రం గట్టిగా తల వొంచకుండా నిలబడి ఉంది. ‘బావా ఇది చూడు .. ఇంత తుఫానునీ తట్టుకుని నిలబడింది అంటే అడవి మొక్క అయ్యుంటుంది. నువ్వు తెచ్చిన విత్తనాలు వేస్తే వచ్చింది’ అంది.

కుమార్‌కు షర్కియా గుర్తుకు వచ్చింది. ఇక ఆగలేక స్టేషన్‌లో తెలిసిన కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేశాడు.‘అన్నా.. ఆ అమ్మాయిని ఏం చేశారు?’ ఆందోళనగా అడిగాడు.‘ఏమైనా చేయడానికి ఆ అమ్మాయేమైనా కుందేలు పిల్లా? నక్సలైట్‌ కూతురు. నాలుగు సెక్షన్లు చదివి ఎస్సైకే వార్నింగ్‌ ఇచ్చింది. చాలా ధైర్యం. అలా ఉండాలి ఆడపిల్లంటే’ ‘మరి ఊరెళ్లిపోయిందా?’‘నేనే బస్సెక్కించాను ఆ రోజే’ ‘బతికించావు’ ఫోన్‌ పెట్టేశాడు.హుషారుగా తోటను బాగు చేసే పనిలో పడ్డాడు కుమార్‌.కరుణ అతడి దగ్గరకు వచ్చి ‘మనకో కూతురు పుడితే ఎలా ఉండాలనుకుంటావ్‌ బావా’ అనడిగింది.కుమార్‌ కుండీలో ఉన్న మొలక వైపు చూపుతూ ‘అదిగో అలా’ అన్నాడు.కరుణ అప్పుడు మెల్లగా అతని చేయి అందుకుని తన కడుపు మీద వేసుకుంటూ నవ్వింది. గొప్ప వెలుతురు నవ్వు అది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement