
విషయమేదైనా ఆకట్టుకనే ప్రచారం ఆతని సొంతం హాస్యం, చతురోక్తులతో ఆకట్టుకునే స్వరం యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్ మైక్‌సెట్ బిగించడంతో ప్రారంభమై నో డేట్స్ ప్లీజ్ అనే స్థాయికి ఎదిగిన నూకరాజు
పుట్టిన ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తించి వ్యక్తపరచినపుడే ఆ కళకు సార్థకత. ఇదిగో ఈ పిఠాపురానికి చెందిన నూకరాజు ప్రావీణ్యం అలాంటిదే. శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు మైక్‌సెట్లు బిగించడంతో ప్రారంభమైన అతని ప్రస్థానం నేడు నో డేట్స్ ప్లీజ్ అనే వరకు వెళ్లిందంటే అతనిలోని ప్రతిభను ఏ మేరకు సానబట్టారో. అతని గొంతు వినపడిందంటే చాలు ఏదో ముఖ్యమైన సమాచారమేనని ఇళ్లలో ఏ మూలనున్నా ఓ చెవు అతడు చెప్పే మాటపై వేస్తున్నారంటే ఆ మాటకున్న విలువ అంతటిదని చెప్పడం అతిశయోక్తి కాదు.
మహాశయులకు విజ్ఞప్తి అంటూ ప్రారంభించే నూకరాజు ధాన్యం కొనుగోళ్లు.. జాతరల కార్యక్రమ వివరాలు.. రాజకీయ సభల వివరాలు, ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి పాంప్లేట్లలోని సమాచారం.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రతి మనిషికి చెవినిల్లు కట్టుకుని మరీ చెప్తుంటాడు.
కరోనా కష్టకాలంలో అయితే అతని సేవలు అంతా ఇంతా కాదు.. ఆరోగ్య భద్రతపై అతను చేసిన ప్రచారం స్థానికంగా ఎంతో మేలు చేసింది. చిన్న సైకిల్‌పై మైక్ సరంజామా అంతా కట్టుకుని అతను చేసే ప్రచారం పేరున్న యాడ్ ఏజెన్సీలు సైతం చేయలేవంటారు స్థానికులు. కారణం లేకపోలేదు. అతని స్టైలే అతని ప్రచారానికి ప్రధాన ఆకర్షణ.
కేవలం పాంప్లేట్ లేదా పోస్టర్‌లో ఉన్న అంశాన్ని చెప్తూ వెళ్లిపోతుంటే ఇంతలా చెప్పుకోవడం ఎందుకూ.. అక్కడే ఉంషమ్మత్తు అంతా.. అతని మాటలో మహత్తు అది. హాస్యం, చతురత, విషయానుకూలంగా హాస్యోక్తులు జోడించి చెప్పడం అతని ప్రత్యేకత. మరి 50 ఏళ్ల ప్రస్థానమది. ఊరికే వస్తుందా ఆ పరిణితి. మైక్ అతని ఇంటి పేరుగా స్థిరపడిపోయేంతగా.
మైక్‌తో అనుబంధం
నిరుపేద కుటుంబంలో పుట్టిన మొల్లేటి నూకరాజు మండలంలోని విరవ గ్రామానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి మైక్ సెట్లు అంటే ఇష్టం. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న అతడు 20 ఏళ్ల వయసులో మైక్‌సెట్లు బిగించే పనిలో చేరాడు. అన్ని రకాల శుభకార్యాలకు, సభలు, సమావేశాలకు వెళ్లి మైక్ సెట్లు వేసే వాడు.
ఆ క్రమంలోనే సరదాగా మైక్‌లో చతురోక్తులు వేస్తూ అందరిని అలరించేవాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు సభలు, సమావేశాల్లో ఆయనతో ముందుగా మాట్లాడించేవారు. ఇలా మైక్ ఎనౌన్సర్‌గా మంచి పేరు సంపాదించాడు. ఏదైనా విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఉపయోగించే దండోరాలకు బదులు మైక్ సెట్లు వినియోగం వచ్చాక రిక్షాలో మైక్ ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఎన్ని వచ్చినా నూకరాజుకు మాత్రం ఆ సైకిలే ప్రచార వాహనం.
నా జీవితం మైక్‌కే అంకితం
మైక్ అనేది నా జీవితంలో భాగమైపోయింది. అది లేని రోజంటూ లేదు. రోజంతా ఊరంతా తిరిగి ప్రచారం చేసి ఇంటికి వచ్చాక కూడా దానిని మరుసటి రోజుకు సిద్ధం చేయడం తప్ప వేరే పని తెలీదు నాకు. మైక్‌లో ప్రచారం చేసే వాయిస్ కూడా నేనే చెబుతాను.
ఐదో తరగతి మాత్రమే చదివినా చదవడం రాయడం బాగానే వచ్చు. విషయం చెబితే దానికి తగ్గట్టుగా వాయిస్ రికార్డు చేసి ప్రచారం చేస్తుంటాను. గతంలో మైక్‌లో మాట్లాడుతూ ప్రచారం చేసే వాడిని. ఇప్పటికీ సైకిల్ తొక్కగలుగుతున్నానంటే ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సాహం అభిమానం మాత్రమే. ఇదే పనితో కుటుంబాన్ని పోషించుకుంటు పిల్లలకు పెళ్లిళ్లు చేశాను. ఇప్పుడు నాజీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాను.
– మైక్ నూకరాజు, విరవ, పిఠాపురం మండలం
గిరాకీ అంతా ఇంతా కాదు
మైక్ ప్రచారాల కోసం ప్రయత్నించే వారు ఆయన కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైనా కార్యక్రమానికి అతని ప్రచారం కావాలంటే నెల రోజులు ముందుగానే బుక్ చేసుకోవలసిన స్థాయి అతనిది. 74 ఏళ్ల వయసులో ఇప్పటికీ సైకిల్ పైనే తిరుగుతు మైక్‌తో ప్రచారం చేస్తున్న అతనిని అందరూ ఇంట్లో వ్యక్తిగా ఆప్యాయంగా పలకరిస్తుంటారు.
(చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!)