
ముంబైలోని వివిధ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు
ప్రత్యేకపూజలు, పంచాంగపఠనం, ఉగాదిపచ్చడి పంపిణీ
కవి,సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా గడిపిన తెలుగు ప్రజలు
పన్వేల్ ఆంధ్రా కళా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం చెప్పారు. ఈ వేడుకల్లో సమితి సభ్యులు, పన్వేల్‌లోని తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండవ కృష్ణ పంచాంగ పఠనం, క్రాంతి నాట్య, గానాలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన వారికి సమితి సభ్యులు ఉగాది పచ్చడితో పాటు నూతన పంచాంగం పుస్తకాలను పంపిణీ చేశారు.
ముంబై ఆంధ్ర ప్రజా సంఘం ఆధ్యర్యంలో...
ముంబై ఆంధ్ర ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మహిళలు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉగాది పచ్చడి తయారు చేసి ఒకరొకొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జాయింట్ సెక్రటరీ రాజకుమార్ సతీమణి జ్యోతి ఆధ్వర్యంలో ఉగాది ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ మాకె రాంబాబు, భోగి విష్ణు, సాయిబాబా, ఉండు శ్రీనివాస్, ఎల్లమెల్లి శ్రీనివాస్, ధోనిపాటి శ్రీను, జే ఎస్ మూర్తి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.
వాషి తెలుగు కళా సమితిలో....
వాషిలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష పండితుడు పూజ్యం సత్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సమర్పణం గ్రూప్ ఆలపించిన భక్తి గీతాలు, సిద్ధి నాట్య మందిర్ (గురు రష్మి – శ్రద్ధా భిడే పరివార్) కథక్ నాట్య ప్రదర్శన, ఢీ ప్రోగ్రాం సహాయ నృత్య దర్శకుడు సాయి టీం మెంబర్స్ గ్రూప్‌డాన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త ఎల్ది సుదర్శన్‌కు తెలుగు కళా సమితి సభ్యులు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. అనంతరం విందు భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో సమితి అధ్యక్షుడు బి. నారాయణరెడ్డి , ప్రధాన కార్యదర్శి జి. సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులు టి. విజయలక్ష్మి, సంయుక్త కోశాధికారులు వెలుగొండరెడ్డి, కోటిరెడ్డి, వహీదా, ప్రత్యూష, శోభ, రాధిక, జానకి, కృష్ణ, శ్యామల, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో...
నవీ ముంబై, సిబిడి బేలాపూర్‌లోని సాంస్కృతిక సంస్థ తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగు కళా వేదిక సభ్యులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సామూహిక మహాలక్ష్మీ పూజ , పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మాస్టర్ సాయి హరి భగవద్గీత శ్లోకాల పారాయణ, కుమారి పద్మశ్రీ భరతనాట్య ప్రదర్శన, ప్రముఖ గాయని అనూరాధ శిష్యుల గానం , కవులు అద్దంకి లక్ష్మి రాజశేఖర్ కవితాగానం ప్రేక్షకులను అలరించాయి. అలాగే మహిళా సభ్యులు ప్రదర్శించిన ‘కిట్టీ పార్టీ’హాస్య నాటిక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ కార్యక్రమానికి రవి చిమట వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

తెలుగు సంఘం బోనాలు..
అంధేరీ వెస్ట్‌లోని చార్‌బంగ్లా ప్రాంతంలో ఆదివా రం స్థానిక తెలుగు ప్రజలు బోనాల ర్యాలీతో ఉగాదికి స్వాగతం పలికారు. తెలుగు సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు.

భివండీలో ఉగాది సంబరాలు..
ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం అఖిల పద్మశాలీ సమాజ్ ఆధ్వర్యంలో మండాయిలోని మార్కండేయ మహాముని మందిరంలో ప్రత్యేక పూజలు, ఉగాది పచ్చడి వితరణ జరిగాయి. ఈ సందర్భంగా సమాజ్ అధ్యక్షుడు పొట్టబత్తిని రామకృష్ణ, న్యాయదాని కమిటీ చైర్మన్ ఎలిగేటి శ్రీనివాస్ పట్టణ వ్యాప్తంగా ఉన్న సమాజ్ పెద్దలను టోపీ, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో పట్టణంలోని వివిధ ప్రాంతాంలకు చెందిన అఖిల పద్మశాలీ సమాజం న్యాయనిర్ణేతలు, పెద్దలతోపాటు సమాజ్ ప్రధాన కార్యదర్శి కళ్యాడపు బాలకిషన్, కోశాధికారి యెల్లె సాగర్, కార్యాధ్యక్షుడు గాజెంగి రాజు, ఉపాధ్యక్షుడు వల్లాల్ మోహన్, కొంక మల్లేశం, సుంఖ శశిధర్, కోడం లక్ష్మీనారాయణ, ట్రస్టీలు వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, ఎస్. మల్లేశం, వంగ పురుషోత్తం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పద్మశాలీ సమాజ్ యువక్ మండల్‌లో...
ప్రతి ఏడాది మాదిరిగానే పద్మశాలీ సమాజ్ యువక్ మండల్‌లో, అధ్యక్షుడు వాసం రాజేందర్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అఖిల పద్మశాలీ సమాజ్ కార్యవర్గం కాల పరిమితి పూర్తి కావస్తున్న సందర్భంగా గౌరవ సత్కార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంంలో సమాజ్ పెద్దలు, యువక్ మండలి కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కపిల్ పాటిల్ ఫౌండేషన్ కార్యాలయంలో...
కపిల్ పాటిల్ ఫౌండేషన్ కార్యాలయం, బాలాజీనగర్ సంఘం, కామత్‌ఘర్‌లోని పలు సంఘాల్లో ఉగాది వేడుకలు, ఘనంగా నిర్వహించారు.