
నాకు ఇప్పుడు ఆరవనెల. కొంచెం బరువు ఎక్కువ ఉన్నాను. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నాను. మధ్యలో ఆకలి వేస్తే ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు. ఆరోగ్యకరమైన చిరుతిండ్లు ఏవైనా ఉంటే చెప్పండి?
– జయమేరీ, బళ్లారి
ప్రెగ్నెన్సీలో అధిక బరువు ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. పోషకాహార నిపుణుడి పర్యవేక్షణలో ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. ముందు నుంచి అలవాటు లేని కొత్త రెసిపీస్, డైట్‌లో మార్పులు అకస్మాత్తుగా చెయ్యకూడదు.
స్నాక్స్‌లో అధిక కొవ్వు, అధిక చక్కెరని అసలు తీసుకోకూడదు. వీటితో రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, మధుమేహ వ్యాధికి వచ్చే మార్పులు పెరుగుతాయి. పేస్ట్రీ, పిజ్జా, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్ లాంటివి అసలు తినకూడదు. డైట్ షెడ్యూల్ మధ్యలో ఆకలి వేస్తే తాజా పండ్లు, గ్రీన్ ఆపిల్, నారింజ, జామ తినచ్చు.
గ్రిల్డ్ శాండ్విచ్ వంటివి తీసుకోవచ్చు. ఈ రోజుల్లో చక్కెర లేని కొవ్వు తక్కువ పెరుగు రకరకాల బ్రాండ్లలో దొరుకుతోంది. కూరగాయలు, బీన్స్, సూప్స్ తీసుకోవచ్చు. చక్కెర వేయని బాదం పాలు, పండ్ల రసాలు, కీరా తీసుకోవచ్చు. కాల్చిన బీన్స్, కాల్చిన బంగాళ దుంపలు తీసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. మధుమేహం లేనివారు కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు, డ్రైఫ్రూట్స్, మిల్క్ షేక్స్ తీసుకోవచ్చు.
డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్ హైదరాబాద్
(చదవండి: ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!)