
బిహార్ మాజీ ముఖ్యమంత్రి ‘జన నాయక్’ కర్పూరీ ఠాకూర్ (1924–88) శతజయంతి నేడు; కేంద్ర ప్రభుత్వం నిన్న ఆయనకు మరణానంతరం ‘భారతరత్న’ ప్రకటించింది.
బిహార్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన (1970–71, 1977–79) కర్పూరీ ఠాకూర్ జీవితం సరళత, సామాజిక న్యాయం అనే జంట స్తంభాల చుట్టూ తిరిగింది. ఆయన సాధారణ జీవనశైలి, వినయపూర్వకమైన స్వభావం సామాన్య ప్రజలను లోతుగా ప్రభావితం చేశాయి. సామాజిక న్యాయం ఆయనకు అత్యంత ప్రియమైన అంశం. భారత సమాజాన్ని పీడిస్తున్న వ్యవస్థాగత అసమానతలను పరిష్కరించేందుకు పట్టుదలగా కృషి చేశారు. తన రాజకీయ ప్రయాణంలో వనరులు సక్రమంగా పంపిణీ అయ్యే సమాజాన్ని నిర్మించేందుకు పూనుకున్నారు. ఆయన నాయకత్వంలో, ఒకరి పుట్టుక ఒకరి విధిని నిర్ణయించని; సమగ్ర సమాజానికి పునాది వేసే విధానాల అమలు జరిగింది. దురదృష్టవశాత్తూ 64 ఏళ్ల వయసులోనే అర్ధంతరంగా మరణించినా, కోట్లాది మంది హృదయాల్లో నిలిచారు... నేడు మన ‘భారత రత్న’మై వెలిగారు.
సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసి, కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీ యుడు, ‘జన్ నాయక్’ కర్పూరీ ఠాకూర్ జీ శత జయంతి నేడు. కర్పూరీ జీని కలిసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు కానీ, ఆయనతో సన్నిహితంగా పనిచేసిన కైలాసపతి మిశ్రా గారి నుండి నేను ఆయన గురించి చాలా విన్నాను. ఆయన సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలలో ఒకటైన నాయి(క్షురక) కులానికి చెందినవారు. అయినప్పటికీ ఎన్నో ఆటంకాలను అధిగమించి, అకుంఠిత దీక్షతో శ్రమించి, సమాజాభివృద్ధికి పాటుపడ్డారు.
కర్పూరీ ఠాకూర్‌జీ జీవితం సరళత, సామాజిక న్యాయం అనే జంట స్తంభాల చుట్టూ తిరిగింది. తన చివరి శ్వాస వరకు, ఆయన సాధారణ జీవనశైలి, వినయపూర్వకమైన స్వభావం సామాన్య ప్రజల హృదయాల్లో లోతుగా ప్రతిధ్వనించాయి. ఆయన సింప్లిసిటీని హైలైట్ చేసే అనేక వృత్తాంతాలు ఉన్నాయి. తన కూతురి పెళ్లితో సహా, ప్రతీ వ్యక్తిగత వ్యవహారానికి తన సొంత డబ్బును మాత్రమే ఎలా ఖర్చు పెట్టడానికి ఇష్టపడేవారో ఆయనతో పనిచేసిన వారు గుర్తు చేసుకుంటారు.
బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాజకీయ నాయ కుల కోసం ఒక కాలనీని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆయన మాత్రం తనకోసం ఎటువంటి భూమి గానీ, డబ్బు గానీ తీసుకోలేదు. 1988లో ఆయన మరణించినప్పుడు పలువురు నాయ కులు ఆయన గ్రామానికి వెళ్లి నివాళులర్పించారు. ఆయన ఇంటి పరి స్థితిని చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు– ఇంత మహోన్నతుని ఇల్లు ఇంత సాదాసీదాగా ఎలా ఉందా అని!
ఇలా కూడా ఉంటారా?
1977లో బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన సరళతకు సంబంధించిన మరో కథనం ఇది. అప్పుడు కేంద్రంలో, బిహార్‌లో జనతా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో, లోక్‌నాయక్ జేపీ(జయప్రకాశ్ నారాయణ్) పుట్టినరోజు సందర్భంగా జనతా నాయకులు పట్నాలో గుమిగూడారు. అప్పుడు ముఖ్యమంత్రి కర్పూరీ జీ కూడా వారితో ఉన్నారు. ఆయన చిరిగిన కుర్తాతో నడిచిరావడం వాళ్లు గమనించారు. చంద్రశేఖర్ జీ(మాజీ ప్రధాన మంత్రి; జనతా పార్టీ నేత) తనదైన శైలిలో, కర్పూరీజీ కొత్త కుర్తాను కొనుగోలు చేసేందుకు కొంత డబ్బును విరాళంగా ఇవ్వాలని ప్రజలను కోరారు. అయితే, కర్పూరీ ఆ డబ్బును అంగీకరించారు కానీ దానిని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చేశారు. అదీ ఆయన గొప్పతనం! తనకు సాటి ఎవరూ లేరని ఆ ప్రవర్తనతో చాటి చెప్పారు.
కర్పూరీ ఠాకూర్ సామాజిక న్యాయం కోపం పరితపించారు. ఆయన రాజకీయ ప్రయాణంలో వనరుల పంపిణీ నిష్పాక్షికంగా జరగాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ వారి సామాజిక స్థితిగతు లతో సంబంధం లేకుండా అవకాశాలను పొందాలని తపించారు. భారత సమాజాన్ని పీడిస్తున్న వ్యవస్థాగత అసమానతలను నిర్మూలించడానికి పట్టుదలతో కృషి చేశారు.
తన ఆదర్శాల పట్ల ఆయనకున్న నిబద్ధత ఎలాంటిదంటే, కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న కాలంలో జీవించినప్పటికీ, కాంగ్రెస్ తన వ్యవస్థాపక సూత్రాల నుండి వైదొలిగిందని చాలా ముందుగానే నమ్మినందున, స్పష్టమైన కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు.
ఆయన ఎన్నికల జీవితం 1950ల మొదట్లో ప్రారంభమైంది. అప్పటి నుండి, శాసన సభలో గణనీయమైన శక్తిగా మారారు. కార్మి కులు, సన్నకారు రైతులు, యువకుల కష్టాలకు శక్తిమంతమైన గొంతుకై, వారి పోరాటాలకు అండగా నిలిచారు. విద్యకు కూడా ఆయన అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. తన రాజకీయ జీవితంలో పేదలకు విద్యా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎంతగానో కృషి చేశారు. ఉన్నత స్థానాలకు ఎదగాలంటే చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలకు స్థానిక భాషలలో విద్యా బోధన అందాలని సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో వయోవృద్ధుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టారు.
కర్పూరీ వ్యక్తిత్వంలో ప్రజాస్వామ్యం, చర్చోపచర్చలు, సమా వేశాలు అంతర్భాగంగా నిలిచాయి. యువకుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో మునిగితేలినప్పుడూ, మళ్లీ ఎమర్జెన్సీని కరాఖండీగా ఎదిరించి నిలిచినప్పుడూ ఈ స్ఫూర్తి కనిపిస్తుంది. ఆయనదైన ఈ ప్రత్యేక దృక్పథాన్ని జేపీ, డాక్టర్ లోహియా, చరణ్ సింగ్ వంటివారు గొప్పగా మెచ్చుకునేవారు.
బహుశా కర్పూరీ ఠాకూర్ భారతదేశానికి అందించిన అత్యంత ముఖ్యమైన సహకారాలలో ఒకటి... వెనుక బడిన తరగతుల వారికి తగిన ప్రాతినిధ్యం, అవకాశాలు లభిస్తాయన్న ఆశతో వారి కోసం నిశ్చయాత్మక చర్యలను బలోపేతం చేయడం. ఆయన నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఆయన నాయ కత్వంలో, ఒకరి పుట్టుక ఒకరి విధిని నిర్ణయించని, సమగ్ర సమాజానికి పునాది వేసే విధానాల అమలు జరిగింది. ఆయన సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారు అయినప్పటికీ, ప్రజలందరి కోసం పనిచేశారు. సంకుచిత భావాలతో పని చేయలేదు. ఆయనలో లేశ మాత్రమైనా కాఠిన్యం ఉండకపోయేది, అదే ఆయన్ని నిజమైన గొప్పవాడిగా నిలబెట్టింది.
ఆయన బాటలో...
గత పదేళ్లుగా, మా ప్రభుత్వం కూడా జన్ నాయక్ కర్పూరీ ఠాకూర్ భావాలు, విధానాలను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తోంది. సామాజిక సాధికారత సాధించడం లక్ష్యంగా మా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తూ, ప్రజా సంక్షేమ విధానాలు అనుసరిస్తోంది. కర్పూరీ వంటి కొద్దిమంది నాయకులను మినహాయిస్తే, సామాజిక న్యాయం కోసం ఇచ్చే పిలుపు కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే పరిమితం కావడం మన రాజకీయ వ్యవస్థ తాలూకు అతిపెద్ద విషాదాలలో ఒకటి. కర్పూరీ ఠాకూర్ విధానాల నుండి స్ఫూర్తి పొంది సమర్థవంతమైన పాలన విధానాన్ని మేము అమలు చేస్తున్నాం.
గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం బారి నుంచి విముక్తి పొందారు. వీరంతా అత్యంత వెనుకబడిన వర్గా లకు చెందిన వారు. వలస పాలన నుంచి విముక్తి పొంది దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా వీరికి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదు. సామాజిక న్యాయ సాధన కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలి అన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పని చేస్తోంది. మా ప్రభుత్వం సాధించిన విజయాలను చూసి కర్పూరీ ఠాకూర్ ఎంతో గర్వపడేవారని నేను నమ్మకంగా, గర్వంగా చెప్పగలను.
నేడు ముద్ర రుణాల వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్న తరుణంలో కర్పూరీ ఠాకూర్ కలలుగన్న ఆర్థిక స్వావలంబన కార్య రూపం దాలుస్తోంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను పొడిగించే అదృష్టం మా ప్రభుత్వానికే దక్కింది. కర్పూరీ ఠాకూర్ చూపిన మార్గంలో పని చేస్తున్న ఓబీసీ కమిషన్‌ను (దీనిని కాంగ్రెస్ వ్యతిరేకించింది) ఏర్పాటు చేసిన ఘనత కూడా మాకు దక్కింది. మా పీఎం–విశ్వకర్మ పథకం భారతదేశం అంతటా ఓబీసీ వర్గాలకు చెందిన కోట్లాది మందికి కొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది.
వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిగా నేను కర్పూరీ ఠాకూర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దురదృష్టవశాత్తూ 64 ఏళ్ల వయసులోనే ఆయన మరణించారు. చాలా అవసరమైన సమయంలో మనకు దూరం అయ్యారు. అయినా ఆయన తన పని వల్ల కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన నిజమైన ప్రజా నాయకుడు!
నరేంద్ర మోదీ
భారత ప్రధాని