
ఇవావో హకమట
జపాన్ కోర్టు సంచలన తీర్పు
హత్యల కేసులో ఓ వ్యక్తికి మరణ శిక్ష పడింది. దాదాపు 50 ఏళ్లు గడిచినా ఆ శిక్ష అమలు కాలేదు. కేసు పునర్విచారణ అనంతరం గతేడాది 89 ఏళ్ల వయస్సులో కోర్టు ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది. మానసికంగా ఆయన తీవ్రంగా దెబ్బతినడంతో జైలులో పడిన వేదనకు ప్రతిఫలంగా రూ. 12.41 కోట్లు చెల్లించాలని తాజాగా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జపాన్‌లోనే కాదు ప్రపంచ క్రిమినల్ కేసుల చరిత్రలో ఇదే అత్యంత భారీ నష్ట పరిహారంగా చెబుతున్నారు.
1966లో టోక్యోకు పశ్చిమాన ఉన్న షిజౌకాలోని ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఇవావో హకమట (Iwao Hakamada) అనే వ్యక్తి పనిచేసేవారు. ఒక రోజు ఆ ప్లాంట్ యజమాని, భార్య, ఇద్దరు పిల్లలు వారి ఇంట్లో హత్యకు గురయ్యారు. రూ.కోటి వరకు నగదు మాయమైంది. నలుగురూ కత్తిపోట్లతోనే మరణించినట్లు తేల్చారు. ఇందుకు హకమటాయే కారణమని ఆరోపణలొచ్చాయి. తనకేపాపం తెలియదని హకమట వాదించారు. అయినా అధికారులు వినిపించుకోలేదు. జైలులో ఆయన్ను చిత్ర హింసలు పెట్టారు. రోజుకు 12 గంటలపాటు ఆయ న్ను విచారించారు. తట్టుకోలేక ఆ నేరం తానే చేసినట్లు హకమట ఒప్పుకున్నారు. 1968లో కోర్టు ఆయనకు మరణ శిక్ష (Death Sentence) విధించింది.
తన సోదరుడు అమాయకుడంటూ సోదరి హిడెకు అప్పటి నుంచి, గత 56 ఏళ్లుగా న్యాయం పోరాటం సాగిస్తూనే ఉన్నారు. హతుల దుస్తుల్లో లభ్యమైన డీఎన్‌ఏ (DNA) తన సోదరుడిది కాదని తెలిపారు. ఈ కేసులో ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగానే అతడికి సంబంధించిన ఆధారాలను అక్కడ ఉంచి ఉంటారని ఆమె అంటున్నారు. ఆమె సుదీర్ఘ పోరాటం ఫలించింది. కేసును తిరిగి విచారించేందుకు 2014లో న్యాయస్థానం అంగీకరించింది. హకమట కేసు అత్యంత ప్రముఖ న్యాయ పోరాటంగా మారింది. గత సెప్టెంబర్‌లో షిజౌకా కోర్టు (Shizuoka Court) హకమటను విడుదల చేస్తూ తీర్పు వెలువరించింది.
కోర్టు వద్ద వందలాదిగా గుమికూడిన జనం హకమటను నిర్దోషిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్న హకమట ఇప్పుడు 91 ఏళ్ల తన సోదరి సంరక్షణలో ఉన్నారు. అందుకే విచారణ నుంచి కోర్టు ఆయనకు మినహాయించింది. సోమవారం ఈ కేసును విచారించిన జడ్జి కుని కోషి... హకమట దాదాపు 47 ఏళ్లపాటు జైలులో అత్యంత తీవ్రమైన మానసిక, శారీరక వేదనను అనుభవించారని పేర్కొన్నారు. అందుకు గాను రూ.12.41 కోట్లు పరిహారంగా చెల్లించాలని జైలు అధికారులను ఆదేశించారు.