
అత్యంత వేగంగా వేడెక్కుతోంది
నిత్యం వరదలు, కరువు, వడగాడ్పులే
ఇప్పటికే నానా సమస్యలతో సతమతమవుతున్న యూరప్ ఖండం పరిస్థితి సమీప భవిష్యత్తులో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారనుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు! అది పర్యావరణ మార్పుల ప్రభావానికి అత్యంత ఎక్కువగా లోనవుతుండటమే కారణం. దాంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా యూరప్ నిలిచింది. అంతేగాక వరదల దెబ్బకు ఆ ఖండంలో ఏకంగా 30 శాతం నదుల నెట్‌వర్క్ బాగా దెబ్బతింది.
అక్కడ వాతావరణం ఎప్పుడెలా మారుతుందో ఎవరూ చెప్పలేనంత అస్థిరంగా మారిపోయింది. ఫలితంగా యూరప్‌కు సమీప భవిష్యత్తులో నానారకాలైన ప్రాకృతిక విపత్తులు పొంచి ఉన్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ‘‘వాటిని నివారించాలంటే యూరప్ దేశాలన్నీ ఒక్కతాటిపైకి తక్షణం ఒక్కతాటిపైకి రావాలి. ఇప్పటినుంచే సమగ్ర పర్యావరణ పరిరక్షణ విధానాలు రూపొందించాలి. అంతకంటే ముఖ్యంగా వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి. లేదంటే పెను ముప్పు తప్పదు’’అని వారు కుండబద్దలు కొట్టారు.
నిత్యం ఉత్పాతాలే: యూరప్‌లో పలు దేశాల్లో ఆకస్మిక వరదలు, కనీవినీ ఎరగని ఎండలు, వడగాడ్పులు కొన్నేళ్లుగా పరిపాటిగా మారిపోయాయి. గతేడాది యూరప్‌వ్యాప్తంగా చాలా దేశాలను వరదలు తీవ్రంగా వణికించడం తెలిసిందే. పశ్చిమ యూరప్‌ను గత పదేళ్లుగా 1950ల నుంచీ ఎన్నడూ చూడనన్ని వరదలు అతలాకుతలం చేశాయి. దక్షిణ యూరప్‌లో వరుసగా 13 రోజుల పాటు కనీవినీ ఎరగనంతటి వడగాడ్పులు వణించింయా. స్కాండినేవియాలో గ్లేసియర్లు కొన్నేళ్లుగా శరవేగంగా కరిగిపోతున్నాయి.
తూర్పు యూరప్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. యూరప్‌లోని నదుల్లో 30 శాతానికి పైగా గరిష్ట వరద స్థాయిని దాటిపోయాయి. ఒక్క 2024లోనే 12 శాతం నదులు తీవ్ర వరద స్థాయిలను దాటి నగరాల్లోకి పొంగిపొర్లాయి. ఫలితంగా గత అక్టోబర్లో ఒక్క వాలెన్సియా నగరంలోనే 232 మంది వరదలకు బలయ్యారు. గత సెప్టెంబర్లో బోరిస్ తుఫాను మధ్య యూరప్ దేశాల్లో అతి భారీ వానలకు కారణమైంది. ఇవన్నీ యాదృచ్చికమేమీ కాదని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇదంతా రెండు దశాబ్దాలకు పైగా పర్యావరణంతో యథేచ్ఛగా చెలగాటమాడుతూ వచ్చిన ఫలితమని వారంటున్నారు. యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వస్, ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ)సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో సైంటిస్టులు ఈ మేరకు పేర్కొన్నారు. గతేడాది వరదలకు యూరప్‌లో చాలాదేశాల్లో తీవ్ర విధ్వంసానికి, వినాశనానికి దారితీశాయి. వాటి దెబ్బకు 4 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు.
335 మంది మరణించారు. యూరప్ చరిత్రలోనే కనీవినీ ఎరగని పరిణామమిది. వరదల నష్టం రూ.1.62 లక్షల కోట్ల పై చిలుకేనని అంచనా. ‘‘ఉష్ణోగ్రతలపరంగా యూరప్ ఇప్పటికే నిప్పుల కుంపటిపై కూచుని ఉన్నట్టు లెక్క. ఇకనుంచి పెరిగి ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రతా ఆ ఖండం మొత్తాన్నీ వినాశనం వైపు నెడుతుంది’’అని డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి సెలెస్టీ సావ్‌లో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యూరప్ దిద్దుబాట పట్టింది. 2024లో ఖండంలో ఉత్పత్తయిన మొత్తం ఇంధనంలో సంప్రదాయేతర వనరుల వాటా 45 శాతానికి పెరిగింది. చాలా నగరాలు పర్యావరణ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్