
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా పలుచోట్ల వరదల సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో 32 మంది మృతిచెందారని, 107 మంది గాయపడ్డారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది.
దేశంలో కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు ఏడు రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. 5,575 ఇళ్ళు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, వరదల కారణంగా డయేరియా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇదిలావుండగా కస్సాలా నగరం గుండా ప్రవహించే గాష్ నది నీటి మట్టం పెరుగుతోంది.
దీంతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. సూడాన్‌లో సాధారణంగా జూన్, అక్టోబర్ మధ్య వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది మంది మృతి చెందగా, లెక్కలేనన్ని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి.