కుక్కల దాడిలో రెండు దుప్పులు మృతి | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో రెండు దుప్పులు మృతి

Published Fri, Apr 11 2025 1:24 AM | Last Updated on Fri, Apr 11 2025 1:24 AM

కుక్క

కుక్కల దాడిలో రెండు దుప్పులు మృతి

ఆత్మకూరురూరల్‌: నల్లకాల్వ గ్రామ శివార్లలో ఉన్న వైఎస్సార్‌ స్మృతివనం వెనక వైపు ఉన్న పొలాల్లో ఊరకుక్కల దాడిలో రెండు దుప్పులు మృత్యువాత పడ్డాయి. వెలుగోడు నార్త్‌బీట్‌ ఫారెస్ట్‌లైన్‌ పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావి వద్ద ఉన్న నీటి తొట్టిలో నీరు తాగేందుకు వచ్చిన దుప్పుల మందపై అక్కడ ఉన్న కుక్కల గుంపు దాడికి పాల్పడింది. దుప్పులు అడవిలోకి పారి పోగా రెండు కుక్కల బారిన పడి తీవ్ర గాయాలై మృతి చెందాయి. సమాచారం అందుకున్న వెలుగోడు రేంజ్‌ అధికారి ఖాన్‌ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుప్పులకు స్థానిక వన్యప్రాణి వైద్యనిపుణులతో పోస్ట్‌ మార్టం చేసి కళేబరాలను దహనం చేయించారు. నెలలో దుప్పులపై కుక్కలు దాడి చేయడం ఇది రెండో సారి. గత వారంలో ఇదే ప్రదేశంలో మూడు దుప్పులు కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి.

అప్పుల బాధతో ఆత్మహత్య

గోనెగండ్ల: అప్పుల బాధ తాళలేక ఓ వలస కూలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు.. బైలుప్పల గ్రామానికి చెందిన తలారి చిన్న రంగన్న (41)కు భార్య రాములమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. చిన్న రంగన్న గ్రామంలో తెలిసిన వారి దగ్గర తన అవసరాల నిమిత్తం దాదాపు రూ.15 లక్షలు వరకు అప్పు చేశాడు. కుటుంబంతో సహా గత నెల గుంటూరు జిల్లా కట్ట చెరుకూరు మండలం చింతపల్లిపాడు గ్రామానికి బతుకు దెరువు కోసం వలస వెళ్లాడు. అయితే అప్పుల బాధతో మనస్తాపం చెంది గత నెల 31వ తేదీన పని చేసే చోట పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కర్నూలు ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో మృతిచెందిన చిన్న రంగన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రైలు ఢీకొని

గుర్తు తెలియని వ్యక్తి మృతి

కర్నూలు: కర్నూలు శివారులోని ఇ.తాండ్రపాడు గ్రామ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమా చారం మేరకు గురువారం ఉదయం కర్నూలు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ టి.సి.మాధవస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బ్లూ కలర్‌ రౌండ్‌ నెక్‌ ఫుల్‌ హ్యాండ్‌ టీషర్టు, బూడిద కలర్‌ లోయర్‌ ప్యాంటు, బ్రౌన్‌ కలర్‌ చెప్పులు ధరించాడు. చెప్పులపై ఎయిర్‌స్టైల్‌ అనే అక్షరాలు ఉన్నాయి. కుడి వైపు ఛాతీ మీద గాయమై మానని బెందు ఉంది. అలాగే కుడి చేతి మీద 4 చుక్కలు కలిగిన టాటూ గుర్తు ఉంది. ఎడమ వైపు నడుము, వీపుపై నల్లటి పుట్టుమచ్చలు ఉన్నాయి. మృతుడి ఆచూకీ తెలిసినవారు 9908889696, 9030481295 నంబ ర్లకు ఫోన్‌ చేసి సమాచారమివ్వాలని సీఐ శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు.

కుక్కల దాడిలో  రెండు దుప్పులు మృతి 1
1/2

కుక్కల దాడిలో రెండు దుప్పులు మృతి

కుక్కల దాడిలో  రెండు దుప్పులు మృతి 2
2/2

కుక్కల దాడిలో రెండు దుప్పులు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement