
ఉమ్మడి జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీలలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు ఉన్నారు. వీరిలో నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న జి.సబిత యాదాద్రి–భువనగిరి జిల్లాలోని రామన్నపేటకు బదిలీ అయ్యారు. దీంతో ఆ బాధ్యతలను కల్వకుర్తి జడ్జికి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ కోర్టులో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న నసీం సుల్తానాను నాగర్‌కర్నూల్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పంపిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో అడిషనల్ జడ్జిగా పని చేస్తున్న వి.ఈశ్వరయ్యను మహబూబ్‌నగర్ జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్ర జుడీషియల్ అకాడమిలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్.వెంకట్‌రాంను నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టుకు సీనియర్ సివిల్ జడ్జిగా రానున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జి.కళార్చన వనపర్తి జిల్లా కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కమలాపురం కవితను వనపర్తిలోని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న టి.లక్ష్మిని అక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు. అలాగే ఇదే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న గంటా కవితాదేవిని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. మహబూబ్‌నగర్ కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న గుండ్ల రాధికను ఇక్కడే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జిగా మార్చారు.