
సినిమా రెమ్యునరేషన్‌ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది కానీ దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం... ఇప్పుడు రెమ్యునరేషన్స్ విషయంలో సినిమా దర్శకులు హీరోలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కొందరు దర్శకులైతే టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు దర్శకుల పారితోషికాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
నెం.1 ప్లేస్‌లో జక్కన్న
ప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీపరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది.. డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్ అని నిరూపించుకుంటోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్ మెగా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) నెం1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి 1, 2లతో పాటు RRRల ద్వారా వందలు, వేల కోట్ల కలెక్షన్లతో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్... దాదాపుగా రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తోంది. దశాబ్ధానికిపైగా హిట్స్ ఇస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే... మిగిలిన టాప్ 5లో కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాకడం గమనార్హం.
రెండో ప్లేస్ కూడా మనదే..
అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగుదర్శకుడైన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఉండడం విశేషం. తెలుగు అర్జున్‌రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్‌కి ఎదిగిపోయిన సందీప్... అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్ సినిమాలతో రూ.100 నుంచి రూ.150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లాడు. ఏకంగా నెం. 2 స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. కేవలం మూడే సినిమాలతో ఆయన ఈ ఘనత సాధించడం చెప్పుకోదగ్గది. అదే రకంగా దేశం అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ది సైతం అనూహ్యమైన విజయయాత్రే.
100% సక్సెస్ రేటు
ఈ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ (Atlee Kumar) కేవలం ఆరు చిత్రాలతో 100 శాతం సక్సెస్ రేటుతో 3వ స్థానం దక్కించుకున్నాడు. తమిళ చిత్రాలైన మెర్సల్, బిగిల్‌లతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వంటి బ్లాక్ బస్టర్‌లతో అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం తాత్కాలిక టైటిల్ ఎఎ22ఎక్స్‌ఎ6 పేరుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అట్లీని అమాంతం 3వస్థానంలోకి చేర్చింది.
233% రెమ్యునరేషన్ పెంచిన డైరెక్టర్
జవాన్ కోసం రూ. 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి రూ. 100 కోట్లకు అంటే.. దాదాపుగా 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్‌గా అట్లీని మూడవ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత రూ.80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, రూ.75 కోట్లతో 5వస్థానంలో సుకుమార్, రూ. 55–65 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు.
చదవండి: ఇంట్లో గొడవలు.. చనిపోదామనుకున్నా.. ఏడ్చేసిన గీతూ రాయల్