
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు మంగళవారం(మార్చ్ 19)న విచారించనుంది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో ఇప్పటివరకు ఏకంగా 230 పిటిషన్‌లు ఫైల్ అయ్యాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లను విచారించనుంది.
సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్‌లో కోరింది. సీఏఏ సెక్షన్ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు సీఏఏపై సుప్రీంకు వెళ్లారు.