
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)కు ఇప్పట్లో కష్టాలు తీరేలా కనిపించడంలేదు. లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసి, విచారణకు పిలిచింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భూమికి ప్రతిగా ఉద్యోగం కుంభకోణానికి సంబంధించిన కేసులో వారిని విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది.
వీరిని పట్నాలో విచారించనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు అతని భార్య రబ్రీ దేవి(Rabri Devi), పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ లకు ఈడీ సమన్లు జారీ చేసింది. మార్చి 19న లాలూ యాదవ్‌ను విచారణకు పిలిచారు. ఈ విచారణ పట్నా జోనల్ కార్యాలయంలో జరగనుంది. ‘భూమికి ప్రతిగా ఉద్యోగం’ కుంభకోణంపై లాలూను విచారించనున్నారు. ఈ ఉదంతంలో మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై గత ఏడాది ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఆయన కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లతో పాటు మరికొందరిని కూడా నిందితులుగా చేర్చారు.
ఇది కూడా చదవండి: దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి