
Arunachal Pradesh Assembly Elections: షెడ్యూల్ ప్రకారం ఎన్నికల తేదీకి వారాల ముందే అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుందని ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రకటించారు. శనివారం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్‌తోపాటు మరో ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
"మేము పోటీ లేకుండా 10 సీట్లు గెలుచుకున్నాం. ఎన్నికలకు ముందే ఇది చాలా పెద్ద విజయం. మా అభివృద్ధి పనులకు ప్రజలు ఇస్తున్న భారీ మద్దతుకు ఇదే నిదర్శనం. ప్రజలు మమ్మల్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. మా ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. అలాగే రెండు లోక్‌సభ స్థానాలను కూడా భారీ మెజారిటీతో గెలుచుకుంటాం” అని సీఎం ఖండూ అన్నారు.
ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో బీజేపీ మద్దతుదారులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 60 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 34 స్థానాల్లో పోటీ చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.