
ముంబై: ప్రాపంచిక జీవితాన్ని వదిలేసి జైన సన్యాసం స్వీకరించిన వ్యక్తి పేరుతో ఉన్న ఆర్‌బీఐ బాండ్లను తమకు బదిలీ చేయాలంటూ అతడి భార్య, తల్లి వేసిన రిట్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. ప్రాపంచిక జీవితాన్ని త్యజించడమంటే మరణంతో సమానమని, అతడి ఆస్తులకు తామే వారసులమవుతామన్న వారి వాదనలను తోసిపుచ్చింది.
మనోజ్ జవెర్‌చంద్ దెధియా అతడి కుమార్తె, కుమారుడు జైన సన్యాసం స్వీకరించి, సాధువులుగా మారారు. పేర్లను సైతం మార్చుకున్నారు. అయితే, 2022 నవంబర్‌లో మనోజ్ సన్యాసం తీసుకోకమునుపు, తన పేరుతో ఉన్న ఆర్‌బీఐ బాండ్లను ట్రాన్స్‌ఫర్ చేసే విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ అధికారులను సంప్రదించారని పిటిషనర్ల లాయర్ హితేశ్ సోలంకి కోర్టుకు తెలిపారు.
తమ నిబంధనల ప్రకారం సన్యాసమంటే మరణంతో సమానం కాదని వారు ఆయన వినతిని తిరస్కరించారన్నారు. స్పందించిన ధర్మాసనం.. కేవలం సన్యాసం స్వీకరించిన ఫొటోలు, ఆహ్వాన పత్రికలుంటే చాలదని, అందుకు అనుగుణమైన క్రతువులు జరిపినట్లు ఆధారాలు చూపాల్సి ఉందంది. ఈ వ్యవహారంపై సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.