
లక్నో: పోలీసే దొంగలా ఒక షాపు నుంచి ఎలక్ట్రిక్ బల్బ్‌ని కొట్టేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ రాజేష్ వర్మ మూసేసి ఉన్న షాపు వద్ద బల్బుని తీసేసి జేబులో పెట్టకుని వెళ్లిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి రాజేష్‌కి అక్టోబర్ 6న దసరా సంబరాలు జరుగుతున్న రోజు ఆ ప్రాంతంలో నైట్ డ్యూటీ పడింది. అప్పుడే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఐతే మరసటి రోజు షాప్ యజమాని వచ్చి చూడగా..బల్బు కనిపించకపోవడంతో సీసీఫుటేజ్ చెక్ చేసి చూశాడు. ఆ వీడియో ఫుటేజ్ చూసి ఆ షాపు యజమాని ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ ఘటన తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు సదరు కానిస్టేబుల్‌ని విధుల నుంచి తొలగించారు. అతను ఈ మధ్యే ఫుల్పూర్ పోలీస్టేషన్‌కి బదిలిపై వచ్చాడు. ఐతే కానిస్టేబుల్ రాజేష్ మాత్రం తాను బల్బు దొంగలించ లేదని బల్బు ఊడిపోతుండటంతో తీసి మళ్లీ సరిచేసి పెట్టానంటూ సమర్థించుకనే యత్నం చేస్తున్నాడు. పైగా చీకటి కాబట్టి ఫుటేజ్ అలా కనిపిస్తుందని వాదిస్తున్నాడు. గతంలో యూపీలో ఇలానే ఒక పోలీసు మొబైల్ ఫోన్‌ని కొట్టేస్తూ పట్టుబడిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
(చదవండి: కేరళ తరహా మరో నరబలి కలకలం.. మూడు రోజులుగా తాంత్రిక పూజలు చేస్తూ..)