
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)ల్లో నిక్షిప్తమై ఉన్న డేటాను డిలీట్ చేయవద్దని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈవీఎంల్లో నిక్షిప్తమైన డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హరియాణా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్(ADR), కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. డేటా డిలీట్ చేసే ప్రక్రియను చేపట్టవద్దని ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది. అదే సమయంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారో చెప్పాలని ఈసీకి స్పష్టం చేసింది.
‘ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయిందని భావించి ఈవీఎంల్లో ఉన్న డేటా తొలగించకండి. ఏవిధమైన డేటాను ఈవీఎంల నుంచి తొలగించవద్దు. అదే సమయంలో ఏ తరహా డేటాను అందులో రీలోడ్ చేయవద్దు’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈవీఎంల డేటా అవసరమైన పక్షంలో ఎన్నికల కమిషన్ కోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో డేటా తొలిగిస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
ఒకవేళ ఓటమి పాలైన అభ్యర్థి వివరణ కోరిన పక్షంలో ఈవీఎంల్లో ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదనే విషయాన్ని ఒక ఇంజనీర్ సాయంతో ధృవీకరించాల్సి ఉంటుందన్నారు చీప్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఈవీఎంల్లోని మైక్రో కంట్రోలర్, మెమొరీల్లో ఉన్న డేటాను తొలగించేందుకు ఏ విధానం అమలు చేస్తున్నారో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.