
ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court) తదుపరి చీఫ్ జస్టిస్‌గా భూషణ్ రామకృష్ణ గవాయ్ (justice Bhushan Ramkrishna Gavai) బాధ్యతలు చేపట్టనున్నారు. మే13న కానున్న ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రిటైర్ కానున్నారు. తదుపరి సీజేఐగా జస్జిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది.
అనంతరం, కొలీజియం తన ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సుకు అనుగుణంగా కేంద్రం జస్టిస్ గవాయిని తదుపరి సీజేఐగా ((Chief Justice of India) నియమించింది. దీంతో సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ అనంతరం సుప్రీం తదుపరి సీజేఐ జస్జిస్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆరు నెలల పాటు సుప్రీం సీజేఐగా జస్జిస్ గవాయ్
కేంద్రం నిర్ణయంతో జస్టిస్ గవాయ్ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్.
జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రస్థానం
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు.
1992లో నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.