
కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గతంలో పేపర్ మ్యాప్‌లను ఉపయోగించడమో లేదా స్థానికులను అడగడం ద్వారానో సరైన దారులను గుర్తించేవారు. అయితే సాంకేతికత పెరిగి యాపిల్ మ్యాప్స్ (Apple Maps), గూగుల్ మ్యాప్స్ (Google Maps) వంటి నావిగేషన్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను సులభతరం చేసింది.
అయితే ఎంత లేదన్నా ఈ యాప్‌లు కొన్ని సమయాల్లో అవిశ్వసనీయంగా ఉంటాయి. మార్గాలు, ప్రయాణ ప్రణాళికలను ప్లాన్ చేయడంలో పనికొచ్చేవే అయినప్పటికీ ఒక్కోసారి తప్పుదారి పట్టిస్తుంటాయి. అలాంటి ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో స్థానికులు గూగుల్ నావిగేషన్ పొరపాటు గురించి ప్రయాణికులను హెచ్చరించే తాత్కాలిక సైన్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో గూగుల్ నావిగేషన్‌ను అనుసరించవద్దని, క్లబ్ మహీంద్రా రిసార్ట్‌కు చేరుకోవడానికి వేరే మార్గంలో వెళ్లాలని సైన్‌బోర్డ్‌లో ప్రయాణికులకు సూచించారు.
దీనికి సంబంధించిన ఫొటోను కొడగు కనెక్ట్ అనే పేరుతో ఉన్న ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. “గూగుల్ తప్పు. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకి వెళ్లదు” అంటూ ఆ సైన్ బోర్డులో ఉంది. ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూగుల్ నావిగేషన్ తప్పుదారి పట్టించడంతో తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు యూజర్లు తమ అనుభవాలను పంచుకున్నారు.
Somewhere in Kodagu. @GoogleIndia pic.twitter.com/IkSQ9VybW1
— Kodagu Connect (@KodaguConnect) March 14, 2024