
భువనేశ్వర్: కరోనా మూడో దశ కొత్త తరహాలో పంజా విసురుతుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిర్వహణ యంత్రాంగం అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. మూ డో దశ కరోనా సంక్రమణ నేపథ్యంలో శిశు సంరక్షణ, చికిత్స పట్ల నిర్వహణ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి పరిస్థితులు చేయి దాటకుండా జాగ్రత్త వహించాలని కోరారు. వచ్చే వారంలోగా రాష్ట్రంలో కరోనా సంక్రమణ పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
కోవిడ్ వితంతువులకు పింఛన్
రాష్ట్రంలో కోవిడ్–19 సంక్రమణతో ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలకు వితంతు పింఛన్ మంజూరుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా మహమ్మారితో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన బాలలకు కూడా పింఛన్ మంజూరు చేస్తారు. మధుబాబు పింఛన్ పథకం కింద 15 రోజుల్లో ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.