
30 వేలకు పైగా మొక్కల సంరక్షణ
సేవలకు గుర్తుగా పద్మశ్రీ అవార్డు
యశవంతపుర: కర్ణాటకలో తన జీవితాన్ని మొక్కలు, చెట్ల పోషణకు అంకితం చేసిన తులసిగౌడ (90) కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హొన్నళ్లికి చెందిన తుళసిగౌడ మంగళవారం వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. మొక్కలు నాటితే చాలదు, వాటిని అలాగే సంరక్షించాలని సూచించేవారు. 17 ఏళ్ల పాటు ఆమె అటవీశాఖలో దినసరి కూలీగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన అప్పటి అటవీశాఖ అధికారి యల్లప్పరెడ్డి ఆమెను పర్మినెంట్ ఉద్యోగిని చేశారు. ఆమె ఉద్యోగంలో ఉన్నా, రిటైరైనా మొక్కలపైనే మనసంతా ఉండేది. అనేక గ్రామాలలో రోడ్డు పక్కన వేలాదిగా మొక్కలు నాటి సంరక్షించారు.
ఫలితంగా పచ్చదనం పెంపొందించారు. సుమారు 30 వేల మొక్కలను నాటి ఉంటారని ఒక అంచనా. ఎంత ఎదిగినా అత్యంత నిరాడంబరంగా ఉండడం ఆమెకే చెల్లింది. తులసిగౌడ సేవలకు గుర్తుగా 2020 జూలైలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇటీవల ఆమె సొంతూరిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆనకట్ట కట్టాలని అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరకటంతో ఆమె ఆగ్రహించి ఆనకట్ట వద్దంటూ సర్వే అధికారులను వెనక్కి పంపారు.
ప్రధాని మోదీ సంతాపం
పర్యావరణవాది, పద్మశ్రీ తులసిగౌడ మరణం తీవ్ర విషాదకరమని ప్రధాని మోదీ ఎక్స్‌లో సంతాపం తెలిపారు. మొక్కల సంరక్షణకే తులసిగౌడ జీవితాన్ని ధారపోశారని, భూమిని రక్షించడానికి యువతకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు.