
రాంచీ: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జార్ఖండ్‌లో సీఆర్‌పీఎఫ్ భద్రతా దళాలు, స్టేట్ పోలీస్ కోబ్రా కమాండోలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. వీరిలో మావోయిస్టు కీలక నేత వివేక్ కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. వివేక్‌పై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.
వివరాల ప్రకారం.. వరుస ఎన్‌కౌంటర్లతో సతమతమవుతోన్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ (Jharkhand)లోని బొకారో జిల్లా లాల్‌పానియా ప్రాంతంలోని లుగు హిల్స్ సీఆర్‌పీఎఫ్ భద్రతా దళాలు, స్టేట్ పోలీస్ కోబ్రా కమాండోలు సోమవారం తెల్లవారుజామున జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడగా ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పుల జరిగాయి. ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు మొత్తం పది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. ఎనిమిది మంది మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఎన్‌కౌంటర్ అనంతరం, అక్కడ.. మందుగుండు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే, కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని సీఆర్‌పీఎఫ్ అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో ముగ్గురు అగ్రనేతలు మృతిచెందారు. వివేక్, అరవింద్ యాదవ్, సాహెబ్ రామ్ ఉన్నారు. వీరిలో అగ్రనాయకుడు వివేక్‌పై కోటి రూపాయల రివార్డు ఉంది. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
వివేక్ స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ జిల్లా తుండి. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో జరిపిన విధ్వంసకర ఘటనల్లో వివేక్ హస్తం ఉంది. మొత్తం 50 కేసుల్లో వివేక్ వాంటెడ్‌గా ఉన్నాడు. గెరిల్లా యుద్ధతంత్రాల్లో ఆరితేరిన వ్యక్తిగా వివేక్‌కు గుర్తింపు ఉంది. చలపతి తరువాత మరో కీలకమైన కేంద్రకమిటీ సభ్యుడుగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.