
లక్నో: చదువుకోవాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వీరు కష్టపడి చదివి ఇంటర్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఇపుడు డిగ్రీ పూర్తి చేయడమే తమ లక్ష్యమని, ఎలాగైనా పట్టుభద్రులం అవుతామని చెబుతున్నారు.
బరేలి జిల్లా బిత్రి-చైన్పూర్ నుంచి 2017లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రాజేశ్ మిశ్రా. మంగళవారం ప్రకటించిన యూపీ ఇంటర్ ఫలితాల్లో ఈయన 500కు గానూ 263 మార్కులు తెచ్చుకుని ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల క్రితమే పదో తరగతి పాసయ్యారు. ఇప్పుడు ఇంటర్ కూడా పూర్తి చేసి చదువుపై తనకున్న మక్కువ చాటుకున్నారు. డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెబుతున్నారు. అయితే మార్కులుపై తాను సంతృప్తిగా లేనని మరోసారి తన ఆన్సర్ షీట్స్‌ను మూల్యంకనం చేయిస్తానని మిశ్రా చెప్పడం గమనార్హం.
హస్తీన్‌పూర్ నుంచి ఎస్పీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభూదయాల్ వాల్మీకి కూడా ఇంటర్‌లో పాసయ్యారు. సెకండ్ క్లాస్‌లో ఆయన ఉత్తీర్ణులయ్యారు. చదవుకు వయసులో సంబంధం లేదని పేర్కొన్నారు. డా.బీఆర్ అంబేడ్కరే తనకు స్ఫూర్తి అని, డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెప్పారు. ఈయన 2002-2007 వరకు, 2012-2017వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.
చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. మూడు రోజులు సంతాప దినాలు..