
లక్నో: భీమ్ ఆర్మీ పార్టీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రయాణిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై అల్లరి మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో రైలు కిటికీ ధ్వంసమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా కమల్‌పూర్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఘటనలో ఆజాద్‌కు ఎటువంటి హాని జరగలేదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వస్తుండగా ఉదయం 7.12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాయనని అనంతరం ఆజాద్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘నా కంటే రెండు సీట్లు ముందు కూర్చున్న ప్రయాణికుడి దగ్గర ఉన్న అద్దాలు పగిలిపోయాయి.
ఈ సంఘటనతో నేను షాక్‌కి గురయ్యాను. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాదు, ప్రయాణికుల భద్రతకు సైతం ముప్పు కలిగించే పరిణామమిది. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదు’అని ఆయన పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో భద్రత కోసం సి–3 నుంచి సి–14 బోగీకి మారినట్లు చెప్పారు. దీనిపై రైల్వే భద్రతాధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి పరిశీలించారని, సి–3 బోగీపై మాత్రమే రాళ్ల దాడి జరిగినట్లు గుర్తించారని ఆజాద్ చెప్పారు. ‘ఒక్క 2022 లోనే రైళ్లపై రాళ్లు రువి్వన ఘటనలు 1,503 నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటితో రైల్వే శాఖకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. పదేపదే జరుగుతున్న ఈ ఘటనలు ప్రయాణికుల ప్రాణాలకు సైతం ప్రమాదకరంగా మారాయి’అని ఆజాద్ తెలిపారు.