
స్టాలిన్‌కు చెక్కు అందిస్తున్న విజయకాంత్
విజయకాంత్‌ను పరామర్శించిన సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం పరామర్శించారు. డీఎంకే పార్టీ నేతలు దురైమురుగన్, రాజాలతో కలిసి విరుగంబాక్కంలోని విజయకాంత్ ఇంటికి స్టాలిన్ వెళ్లారు. విజయకాంత్‌ను శాలువతో సత్కరించారు. తన పక్కన కూర్చోవాలని స్టాలిన్‌ను విజయకాంత్ కోరడం విశేషం. 15 నిమిషాల పాటు స్టాలిన్ అక్కడే గడిపారు.
వారితో పాటు విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత, తనయుడు విజయ ప్రభాకరన్, బావమరిది సుదీష్ ఉన్నారు. అనంతరం కరోనా నివారణ నిధికి రూ. 10 లక్షల చెక్కును విజయకాంత్ సీఎంకు అందజేశారు. రాజకీయ వైర్యం మరిచి తమ నేతను స్టాలిన్ కలవడంపై డీఎండీకే నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని వీడి అమ్మామక్కల్ మునేట్ర కళగంతో కలిసి పోటీచేసిన డీఎండీకే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.