
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ‘మంత్రి’పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంత్రివర్గ మొదటి విస్తరణ లో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో అంతా రెండో విడత విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెండో విడ త కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విప్ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరూ లేరు. దీంతో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కేబినేట్‌తోపాటు ఇతర కీలక పదవుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానా పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జుతోపాటు మరో ముగ్గురు సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ ఉంది.
‘గడ్డం’ సోదరుల పోటీ..
‘గడ్డం’ సోదరులు ఇద్దరూ మంత్రి పదవిపై న మ్మకం పెట్టుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ ఒకరితో ఒకరు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒక దశలో వివేక్‌కు మొదటి కేబినెట్ విస్తరణలోనే బెర్త్ ఖాయమని ఆయన అనుచరులు చె ప్పుకున్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆయన పేరు లేదు. అదే సమయంలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వినోద్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అమాత్య పదవి కోసం పోటీ పడడం కనిపిస్తోంది. ఈ ఇద్దరన్నదమ్ముల్లో ఎవరిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందోనని కేడర్‌లో చర్చ జరుగుతోంది.