
ఉపాధ్యాయుల ఔదార్యం
నిర్మల్‌ఖిల్లా: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు. కుమారుడికి వైద్యం చేయించే స్థోమత లేదని తెలిసి ఆపన్న హస్తం కోసం తల్లి ఎదురుచూసింది. సోన్ కేజీబీవీలో సీఆర్టీగా విధులు నిర్వహిస్తున్న నాగమణి కుమారు డు సాయిప్రసాద్ పరిస్థితిని తెలుసుకున్న ఉపాధ్యాయులు ఔదార్యం చూపారు. వాట్సప్ గ్రూపుల ద్వారా విషయం తెలుసుకుని జిల్లాలోని ఉపాధ్యాయులు చికిత్స కోసం తోచినంతగా ఆర్థికసాయం అందించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తోట నరేంద్రబాబు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్ శనివారం జిల్లాకేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిప్రసాద్‌ను పరామర్శించారు. విరాళాల ద్వారా సేకరించిన నగదు మొత్తం రూ.4.40 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఆయా ఉపాధ్యాయ సంఘాల నాయకులు భూమారెడ్డి, సాయికుమార్, శ్రీనివాస్, కుర్రశేఖర్, అశోక్ పాల్గొన్నారు.