రైలు మార్గం.. మరింత మెరుగు | - | Sakshi
Sakshi News home page

రైలు మార్గం.. మరింత మెరుగు

Published Tue, Apr 29 2025 12:07 AM | Last Updated on Tue, Apr 29 2025 12:07 AM

రైలు మార్గం.. మరింత మెరుగు

రైలు మార్గం.. మరింత మెరుగు

భైంసా: బాసర మీదుగా రైల్వే డబ్లింగ్‌ లైన్‌ పనులకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కొత్త లైన్‌ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే రైల్వేశాఖ టెండర్లు పిలిచి పనులను ప్రారంభించింది. కర్నూలు జిల్లా డోన్‌ నుంచి మహారాష్ట్రలోని ముత్కేడ్‌ వరకు డబ్లింగ్‌ పనుల కోసం 2023–24 రైల్వే బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. రెండింటి మధ్యన ఎన్నో స్టేషన్‌లను కలుపుతూ ఈ పనులు కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో 502.34 కిలోమీటర్ల డబుల్‌ లైన్‌ నిర్మాణానికి రూ.5,655.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ హైదరాబాద్‌ డివిజన్‌ అధికారులు టెండర్లను పిలిచారు. ఈ పనుల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా నవీపేట, నిర్మల్‌ జిల్లా బాసర వరకు 16.90 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ లైన్‌ పనులు చేపట్టనున్నారు. మహారాష్ట్రలోని ముత్కేడ్‌ నుంచి ధర్మాబాద్‌ వరకు రెండేళ్ల క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. ఈ మార్గంలో ఎలక్ట్రిసిటీ పనులు పూర్తయ్యాయి. డబ్లింగ్‌ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రైలు సౌకర్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

జిల్లాలో 12 కిలోమీటర్లు...

నిర్మల్‌ జిల్లాలో డబ్లింగ్‌ లైన్‌ నిర్మాణం కోసం బాసర మీదుగా పనులు చేపట్టనున్నారు. నిర్మల్‌ జిల్లాలో బాసర ఒకే స్టేషన్‌ మీదుగా రైళ్ల రాకపోకలు కొసాగుతాయి. బాసర స్టేషన్‌ దాటగానే అటు మహారాష్టలోని ధర్మాబాద్‌ స్టేషన్‌ వస్తుంది. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాలోని ఫకీరా బాద్‌ స్టేషన్‌ ఉంది. నిజామాబాద్‌ జిల్లా నవీ పేట, ఫకీరాబాద్‌ స్టేషన్‌లను కలుపుతూ బాసర వరకు డబ్లింగ్‌ లైన్‌ పనులు జరుగనున్నాయి. ఈ నిర్మాణ పనుల్లో బాసర వద్ద రెండు ఎకరాలకు పైగా భూమి అవసరం ఏర్పడింది. నిర్మల్‌ జిల్లాలో బాసర – రవీంద్రాపూర్‌ రెండు గ్రామాల పరిధిలో 41 మంది రైతుల తక్కువ వి స్తీర్ణంలో తమ భూములు ఇవ్వాల్సి ఉంది. ఈ రై తులకు రైల్వేశాఖ నష్టపరిహారం చెల్లించనుంది.

రైలు ప్రయాణం మెరుగు

డబ్లింగ్‌ పనులు పూర్తయితే రైళ్ల సంఖ్య రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజుకు 49 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ లైన్‌ ఎలక్ట్రిక్‌ లైన్‌గా మారిన తర్వాత ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుంది. బాసర సరస్వతీ దేవాలయాన్ని దర్శించే భక్తులు, షిర్డీ యాత్రికులు ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడతారు. నాందేడ్‌ డివిజన్‌లో బాసర స్టే షన్‌ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

నాలుగో వంతెన పనులు..

బాసర వద్ద గోదావరి నదిపై డబ్లింగ్‌ లైన్‌ కోసం నాలుగో వంతెన నిర్మాణం జరుగనుంది. ప్రస్తుతం బాసర వద్ద రైల్వే లైన్‌ కోసం ఒక వంతెన, రోడ్డు మార్గం కోసం మరో వంతెన ఉంది. 161 హైవే నిర్మాణంలో భాగంగా రోడ్డు మార్గం కోసం మూడవ వంతెన నిర్మిస్తున్నారు. డబ్లింగ్‌ లైన్‌ కోసం గోదావరి నదిపై నాలుగవ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణంతో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

డబ్లింగ్‌ పనులకు శ్రీకారం

గోదావరి నదిపై నాలుగో వంతెన

బాసర – నవీపేట మధ్య పనులు

వందేళ్లుగా సింగిల్‌ లైనే..

బాసర రైల్వే స్టేషన్‌

నిజాం కాలం నుంచి సింగిల్‌ లైన్‌..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వరకు నిజాం కాలంలో ప్రత్యేక రైల్వేట్రాక్‌ నిర్మించారు. అప్పట్లో నిర్మించిన ఈ ట్రాక్‌ బాసర మీదుగా హైదరాబాద్‌ను కలిపేది. అదే మార్గంలో ఇప్పటికి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. వందేళ్ల క్రితమే నిర్మించిన ఈ ట్రాక్‌ ఇప్పుడు డబ్లింగ్‌ నిర్మాణానికి నోచుకుంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో రైలుమార్గం చాలా తక్కువ. ఉన్న మార్గంలోనూ సింగిల్‌ ట్రాక్‌లే ఉన్నాయి. నిర్మల్‌ – ఆర్మూర్‌ మీదుగా ఆదిలాబాద్‌ వరకు కొత్త రైల్వేలైన్‌ మార్గం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తునే ఉన్నారు. ఈ డబ్లింగ్‌ పనులు పూర్తయితే బాసర మీదుగా వెళ్లే యాత్రికుల ప్రయాణం సులభతరం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement