
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తనను అనుకరించటం చాలా బాధపెట్టిందని ఎన్సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవర్ అన్నారు. శరద్ పవార్ అనుకరణపై బుధవారం అజిత్ పవార్ స్పందించారు. శరద్ పవార్ అలా చేయడం సరికాదని అన్నారు. తన తల్లి పేరు ప్రస్తావనతో భావోద్వేగానికి గురయ్యానని, అది సహజంగానే జరిగిందని చెప్పారు.
‘‘నేనెప్పుడూ శరద్ పవార్‌ని దేవుడిగా భావించే వ్యక్తిని. కానీ ఆయన రుమాలుతో కళ్లు తుడుచుకుంటూ నా ప్రసంగాన్ని అనుకరించారు. శరద్ పవార్ అనుభవజ్ఞులైన నేత. ఆయన నన్ను అనుకరించిన విధానం చాలా మందికి నచ్చలేదు. అదే పని.. బారామతి అభ్యర్థి యోగేంద్ర పవార్ లేదా ఇతరులు ఎవరైనా చేసి ఉంటే ఫర్వాలేదు.
మా అమ్మ పేరు ప్రస్తావనతో నేను కాస్త భావోద్వేగానికి గురయ్యా. నేను కన్నీళ్లు పెట్టుకున్నా. అది చాలా సహజమైంది. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కూడా. నేను నా రుమాలు తీయలేదు. కానీ ఆయన అలా చేశారు. ఇంత కాలం ఆయన రాజ్ ఠాక్రేను మాత్రమే అనుకరిస్తారని అనుకున్నా. కానీ నిన్న(మంగళవారం) శరద్ పవార్ నన్ను కూడా అనుకరించారు. ఆయన అలా చేయటం నిజంగా చాలా బాధ పెట్టింది’ అని అన్నారు.