
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీకి తగిన గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా అసంతృప్తి ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీ తానే అని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో వీహెచ్ తప్ప ప్రస్తుతం నాకంటే అనుభవజ్ఞుడైన నాయకుడు ఎవరున్నారు?. జానారెడ్డి కూడా నాకంటే పార్టీ పరంగా నాలుగేళ్లు జూనియరే. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీని నేనే. శాసనసభ, శాసన మండలిలో.. కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఎంత పోరాటమైతే చేశారో అంతకు మించి పోరాటం నేనూ చేశాను.
సీనియారిటీకి తగ్గ గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా నాకు అసంతృప్తి ఉంటుంది. అది కావాలని కోరుకోవడంలో తప్పేముంది?. సీనియర్ నాయకుడైన ప్రేమ్ సాగర్ రావు అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా మంత్రి పదవులు కావాలని కోరుకోవడంలో తప్పేముంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారి తీసినట్టు తెలుస్తోంది.
