కటకటాల్లో అల్లు అర్జున్.. రేవంత్‌ సాధించిందేమిటి? | KSR Comments On Political Conspiracy Behind Allu Arjun Arrest In Sandhya Theatre Case? More Details Inside | Sakshi
Sakshi News home page

కటకటాల్లో అల్లు అర్జున్.. రేవంత్‌ సాధించిందేమిటి?

Published Sat, Dec 14 2024 1:34 PM | Last Updated on Sat, Dec 14 2024 1:50 PM

KSR Comments On Political Conspiracy Behind Allu Arjun Arrest ?

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సినిమా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్‌ను అరెస్ట్‌ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి సాధించిందేమిటి? అన్నది మొట్టమొదటి ప్రశ్న. అలాగే.. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి? ఈ అంశంపై సినీ రంగం తగు రీతిలో స్పందించిందా? ఈ ఘటనకు ఏపీ రాజకీయాలకు ఉన్న సంబంధాలేమిటి? పుష్ప2 విజయంతో కొందరిలో ఏర్పడ్డ ఈర్ష్య అసూయలే ఈ అరెస్ట్‌కు కారణమా? అల్లూ అర్జున్‌ ఎదుగుదలను ఎవరు సహించలేకపోతున్నారు? ఇలా.. బోలెడన్ని ప్రశ్నలపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 

డిసెంబరు నాలుగున జరిగిన తొక్కిసలాట, శుక్రవారం అర్జున్‌ అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందన అంత అర్థవంతంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే సెలెబ్రిటీలు, సినీ నటులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు తొక్కిసలాటలు జరుగుతూంటాయి. అయితే ఇందుకు వారే కారణమవుతారా? అభిమాన నటుడిని చూసే ప్రయత్నంలో ఎగబడే ప్రజలది తప్పు అవుతుందా? గుంపును కట్టడి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయని థియేటర్‌ యాజమాన్యం బాధ్యత ఎంతవరకూ? సెలిబ్రిటీ రాక గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా సీరియస్‌గా తీసుకోని పోలీసుల తప్పేమీ ఉండదా? 

ఆ మాటకు వస్తే గతంలో పలు రాజకీయ సభలలో, మతపరమైన ఉత్సవాలలోనూ తొక్కిసలాటలు జరిగాయి. ఆయా సందర్భాలలో రాజకీయ నేతలను, మతపరమైన పెద్దలను అరెస్టు చేశారా? అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అర్జున్‌ను  శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేసిన తదుపరి కోర్టు రిమాండ్‌లో చంచల్‌గూడ జైలుకు తీసుకువెళ్లారు. హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా అర్జున్ దాదాపు పన్నెండు గంటలసేపు చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం అరెస్టు చేస్తే,  శని, ఆదివారాలు సెలవు దినాలు కనుక అర్జున్‌కు బెయిల్ రాదన్న  కుట్రతో ఇది జరిగిందని చాలామంది సందేహిస్తున్నారు. అయితే అర్జున్ లాయర్లు వెంటనే స్పందించి హైకోర్టును ఆశ్రయించి తగు ఉత్తర్వులు పొందినా జైలు అధికారులు సాంకేతిక కారణాలతో విడుదల లేట్ చేసినట్లు  ఈ పరిణామం క్రమంపై మీడియా విశేషంగా వార్తలు ఇచ్చింది. 

యథాప్రకారం టీడీపీ మీడియా తన రాజకీయ కుయుక్తులను ప్రదర్శించింది. అర్జున్‌ను జైలు నుంచి అప్పుడే విడుదల చేయడం ఏమిటి? అన్న బాధ వారిలో ఉన్నట్లు కవరేజిని బట్టి అర్థమవుతుంది. ఈ అంశానికంటే ముందు రేవంత్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల మీదే ఎక్కువగా అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. సినిమా నటులు ఏమైనా సైనికులా?ఇండియా  పాకిస్తాన్ బోర్డర్లో యుద్దం చేసి వచ్చారా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. ‘‘సినిమా తీశారు..డబ్బులు సంపాదించుకుంటున్నారు’’ అని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. సంపాదన అన్నది ప్రతి వ్యక్తి చేసేదే. అలాగే కొంతమంది సినీ రంగంలోకి వెళతారు. వారిలో కొద్దిమందే సఫలం అవుతుంటారు. 

ఇదీ చదవండి: సినీ నటులు సైనికులా?

ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవాటిలో సినిమా రంగం ముఖ్యమైంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించే ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పలువురు కృషి చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు వంటివారు సినీ పరిశ్రమ ఇక్కడ అభివృద్ది కావడానికి వీలుగా పలు రాయితీలు ఇచ్చారు. ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు, కృష్ణ తదితర ప్రముఖులు సినీ స్టూడియోలు ఏర్పాటు చేయడానికి, నివాసానికి అవసరమైన స్థలాలు కేటాయించారు. ఫిలింనగర్ పేరుతో ఇప్పుడు వెలుగొందుతున్న ప్రాంతం అంతా అప్పుడు ప్లాన్ చేసినదే. ఆనాటి ప్రభుత్వాలు సినిమాను వ్యాపారంగానే చూసి ఉంటే, హైదరాబాద్‌కు సినీ రంగ పరంగా ఇప్పుడు ఇంత ప్రాధాన్యత వచ్చేదా? ఇన్ని వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సంగతి రేవంత్ కు తెలియదా? 

Actor Allu Arjun Arrested in Sandhya Theatre Stampede Case Photos Viral6

1985 ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్లడానికి సరైన దారే ఉండేది కాదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కుని నాగేశ్వరరావు దానిని అభివృద్ధి చేశారు. సినీ రంగంలో తిరుగులేని స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ నాచారం వద్ద, అలాగే ముషీరాబాద్ లోను స్టూడియాలు ఏర్పాటు చేశారు. అమీర్ పేట వద్ద సారధి స్టూడియో ఏర్పాటైంది. ఆ తర్వాత పలు రికార్డింగ్ ధియేటర్లు వచ్చాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి టైమ్ లో ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డికి , మరి కొందరికి రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు బంజారాహిల్స్‌లో స్థలం ఇచ్చారు. అంతేకాదు. రామోజీఫిలిం సిటీకి కీలకమైన రహదారి కోసం అవసరమైన ఐదెకరాల స్థలాన్ని మరో పారిశ్రామిక వేత్త అయిన సంఘీ నుంచి కోట్ల ప్రభుత్వం వెనక్కి తీసుకుని మరీ ఇచ్చింది. 

కృష్ణ నగర్ ప్రాంతం జూనియర్ ఆర్టిస్టులకు కేంద్రంగా మారింది. ఖాజాగూడ వద్ద  సినీ కార్మికులకోసం ప్రత్యేక కాలనీ చిత్రపురిని ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ఇవన్ని ఎందుకు చేశాయి? ఈ సంగతులు రేవంత్ రెడ్డికి తెలియవా? లేక ఆవేశంలో జరిగిన తప్పును సమర్థించుకోవడానికి సిని పరిశ్రమ వారిని ఉద్దేశించి డామేజింగ్ వ్యాఖ్యలు చేశారా? అన్న భావన కలుగుతుంది. ప్రముఖ నటుడు కృష్ణ ఆర్థిక కష్టాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వపరంగా సాయం చేశారు. అంతే కాదు. మంచి సినిమాలు తీసేవారి కోసం,ఉత్తమ నటీనటులకు  ఉమ్మడి ఏపీలో నంది అవార్డులను ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రభుత్వమే ప్రఖ్యాత గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణలో అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది. 

Actor Allu Arjun Arrested in Sandhya Theatre Stampede Case Photos Viral7

సినీ నటులను వ్యాపారులుగా చూస్తున్నట్లయితే ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నట్లు? అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తారు.జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అల్లు అర్జున్ పొంది తెలుగు వారికి ఒక ఘనత తెచ్చిపెట్టారు. సినీ పరిశ్రమ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు, ప్రభుత్వానికి కూడా గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. ఉదాహరణకు పుష్ప2 సినిమా ద్వారా సుమారు రూ.300 కోట్ల పన్ను వచ్చిందట. అందువల్ల సినిమా పరిశ్రమను, హీరోలను తక్కువ చేసి మాట్లాడడం రేవంత్‌కు తగదని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అనుభవ రాహిత్యాన్ని సూచిస్తాయన్న విమర్శ ఉంది. సినీ పరిశ్రమకే కాదు..ఇతర రంగాలకూ ప్రభుత్వాలు భూములు ఉచితంగా లేదా, తక్కువ ధరకు కేటాయిస్తాయి. 

రాయితీలు ఇస్తాయి. రేవంత్ సైతం ఇలాంటి ప్రోత్సహకాలతోనే పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి డావోస్ వరకు వెళ్లి ప్రయత్నించారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున ఎన్.కన్వెన్షన్ ను ఆకస్మికంగా కూల్చిన తీరు, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి నష్టం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ వ్యక్తిగానే రేవంత్ చెప్పడం చిత్రంగానే ఉంది. అలాగే అర్జున్ మామ చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాట నిజమే కావచ్చు. కానీ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అర్జున్ విషయంలో జాగ్రత్తగా ఎందుకు అడుగులు వేయలేదు. 

అర్జున్ తదితరులు థియేటర్‌ వద్దకు వస్తున్నారని సంధ్యా ధియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసినా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అర్జున్ వెళ్లారని చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి తగునా?హోం మంత్రి బాధ్యతలు కూడా రేవంత్  చేతిలోనే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశమే లేదు. పోలీసులు తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్‌కు పూర్తి సమాచారం ఇవ్వలేదన్న భావన కలుగుతుంది. దీనివల్ల రేవంత్‌కే అప్రతిష్ట. శాఖమీద సరైన కంట్రోల్ లేదు అనిపిస్తుంది. రేవంత్‌ చర్యలు అభద్రతాభావంతో చేసినవని మాజీ మంత్రి కేటీఆర్, స్పెషల్‌షోలకు అనుమతిచ్చినందుకు రేవంత్‌నే అరెస్ట్‌ చేయాలని ఇంకో మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా రేవంత్‌ ప్రభుత్వం అర్జున్‌ను లక్ష్యంగా పెట్టుకని పనిచేసిందని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అర్జున్‌ అరెస్ట్‌ను తప్పుపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇందులో కుట్ర, అసూయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఏపీలో చంద్రబాబు తప్పిదాల వల్ల పుష్కరాలలో 29 మంది, కందుకూరు సభలో ఎనిమిది మంది, గుంటూరులో టీడీసీ సభలో చీరల పంపిణీ కారణంగా నలుగురు మరణించారని, అయినా ఆయనపై కేసులు పెట్టలేదని అన్నారు. తెలంగాణలో అర్జున్‌కు సంబంధం లేకపోయినా తొక్కిసలాటలో ఒకరు మరణించారన్న అభియోగంపై అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అర్జున్‌ అరెస్ట్‌ సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి, నాగబాబు తదితరులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  మాత్రం సరైన పద్ధతిలో స్పందించ లేకపోయారన్న విమర్శలు వచ్చాయి. 

ఎన్నికల సమయంలో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్ధి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లడమే అల్లు అర్జున్ చెసిన పెద్ద తప్పా? అని కొందరు ప్రశ్నించారు. ఈ కక్షతోనే టీడీపీ, జనసేన ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చన్నది పలువురి డౌటుగా ఉంది. ఇందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు కానీ టీడీపీ, జనసేనలు అర్జున్ అరెస్టును ఖండించకపోవడంతో అనుమానాలు వస్తాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రముఖులు కూడా ఒకరిద్దరు తప్ప ఈ ఘటనపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. వారిలో ఎక్కువ మంది రేవంత్ చేసిన వ్యాఖ్యలు, అర్జున్ అరెస్టు తీరుపై అంత సంతృప్తిగా లేకపోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్‌ పై ఈఫార్ములా రేసు నిధుల దుర్వినియోగం కేసు పెట్టడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడానికి  ముందు, తమ ప్రభుత్వం ఎవరినైనా అరెస్టు చేస్తుందని చెప్పడానికి ఏమైనా ట్రయల్ వేశారా? అన్నది మరో పాయింట్‌గా చెబుతున్నారు. 

పోలీసులు అర్జున్‌ను ముందు విచారణకు పిలిచి, తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది.అందుకు ఆధారాలు ఏమిటి అన్న అంశాలపై దర్యాప్తు చేసి ఉండాల్సింది.అలా చేయకుండా శుక్రవారం నాడు నేరుగా ఇంటికి వెళ్లి అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం లో కుట్ర కోణం ఉందన్నది చాలామంది భావన. పోలీసుల అరాచకాలపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము వెనుకబడి పోకూడదన్నట్లుగా తెలంగాణ పోలీసులు కూడా ఇలాంటి అనుచిత చర్యలకు దిగితే  వారికే పరువు తక్కువ. అనేక మంది సినీ నటులు పలు కార్యక్రమాలకు  అటెండ్ అవుతుంటారు. వస్త్రాల షాపుల ప్రారంభోత్సవాలకు హీరో, హీరోయిన్ లు హాజరవుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా సభలలో పాల్గొంటుంటారు. ప్రభుత్వాలు  ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియని స్థితిలో ఇకపై వారు  భయపడే అవకాశం ఉంటుంది. 

కానీ ప్రముఖులు నాని, రామ్ గోపాల్ వర్మ వంటి కొద్ది మంది  తప్ప మిగిలిన  సినీ పరిశ్రమ  పెద్దలు ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లు లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధాల రీత్యా, ప్రభుత్వంతో గొడవపడడం ఎందుకు అన్న భయంతో వారు మాట్లాడడం లేదని కొందరు అంటున్నారు. పుష్ప2 సినిమా రికార్డు  స్థాయిలో సుమారు రూ.1,500 కోట్ల మేర వసూళ్లు చేయడంపై  కొంతమంది సినిమా వారిలో ఈర్ష్యం ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మరో సంగతి చెబుతున్నారు. రేవంత్  స్వగ్రామంలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక  లేఖ రాసి అందులో సీఎం సోదరులపై కొన్ని ఆరోపణలు చేశారు. దానిపై పోలీసులు  కేసు పెట్టకుండా, ముందస్తు విచారణ చేసి, వారి తప్పు ఏమీ లేదని తేల్చేశారట. అదే రూల్ అల్లు అర్జున్‌కు  వ్యర్తించదా అన్న ప్రశ్న వస్తుంది. 

ఏది ఏమైనా ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, మూసి గందరగోళంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దెబ్బ తిన్నదని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సినీ పరిశ్రమపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న భావన వస్తే  రేవంత్ కు అది మరింత నష్టం చేస్తుంది.విశేషం ఏమిటంటే పార్లమెంటులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం చేసిన  రోజున  రేవంత్ ప్రభుత్వం ఇక్కడ అర్జున్ అరెస్టుకు పూనుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ అంశానికే ప్రాధాన్యత వచ్చిందట. ఫలితంగా ప్రియాంక గాంధీ ఉపన్యాసం ఊసే ఎవరూ పట్టించుకోలేదట. దీనివల్ల కాంగ్రెస్ కు ఏమి లాభం వచ్చింది. రేవంత్ తనకు  తానే స్టార్ అని అభివర్ణించుకోవడం తప్పు కాకపోవచ్చు. కాని జనం కూడా ఆయనను స్టార్ అనుకునేలా వ్యవహరించాలి. పాలన సాగించాలి. అలా చేస్తున్నానా? లేదా?అన్నది ఆయన ఆత్మ పరిశీలన  చేసుకుంటే మంచిది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement