ఇండియా–పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధం చేసి వచ్చారా?
అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ వ్యాఖ్య
సినిమా తీశారు.. డబ్బులు సంపాదించుకున్నారు
ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తే ఎందుకింత చర్చ?
మృతురాలి కుటుంబం గురించి ఎవరూ మాట్లాడరెందుకు?
అల్లు అర్జున్ అరెస్టు విషయంలో నా ప్రమేయం ఏమీలేదు
ఆయన మామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ కూడా కాంగ్రెస్‌వాళ్లే
నేనే స్టార్‌ను.. నాకే ఫ్యాన్స్ ఉంటారు.. నేనెవరికీ ఫ్యాన్ కాదు
బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజలకు చూపిస్తే వారే ఓడిస్తారు
వైబ్రంట్ గుజరాత్‌కు పోటీగా తెలంగాణ రైజింగ్ నినాదం
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. సినీ నటులు ఏమైనా ఇండియా–పాకిస్తాన్ సరిహద్దులో యుద్ధం చేసి మన దేశాన్ని గెలిపించి వచ్చారా? అని అల్లు అర్జున్‌ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. సినిమా తీశారు.. డబ్బులు సంపాదించుకున్నారు.. హాయిగా ఇంటికి వెళ్లిపోయారు అని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సినిమా థియేటర్ వద్ద తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబం గురించి ఎవరూ ఎందుకు ప్రశ్నించటంలేదని నిలదీశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. శుక్రవారం ఎజెండా ఆజ్‌తక్ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘అల్లు అర్జున్ ఒక సినిమా నటుడు మాత్రమే. సినిమాకు డబ్బులు పెట్టారు.. డబ్బులు వసూలు చేసుకున్నారు’అని సీఎం అన్నారు. ఆయన అరెస్టు విషయంలో తన ప్రమేయం లేదని స్పష్టంచేశారు. పుష్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ తన పేరును చెప్పకపోవటం వల్లనే అరెస్టు చేశారన్న విమర్శలను సీఎం తోసిపుచ్చారు.
రాజ్యాంగ హక్కులు అందరికీ సమానమే..
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం భారత పౌరులందరికీ సమాన హక్కులు ప్రసాదించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘గతంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఎందుకు అరెస్ట్ అయ్యారు? దేశంలో సామాన్య ప్రజల నుంచి ప్రధానమంత్రి వరకు అందరికీ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుంది. పుష్ప–2 బెనిఫిట్ షోకు మేమే అనుమతి ఇచ్చాం. కానీ, తొక్కిసలాట జరిగిన థియేటర్ వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు చేయని కారణంగానే ఆ ఘటన జరిగింది.
తొక్కిసలాటలో ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత కూడా కేసు పెట్టకపోతే సినిమా నటుడికి ఏమైనా కొత్త రాజ్యాంగాన్ని తయారుచేశారా అని మీరే ప్రశి్నస్తారు కదా? నేరం జరగడానికి కారణం ఎవరు అనేది మాత్రమే ప్రభుత్వం చూస్తుంది. సినిమా స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండదు’అని స్పష్టంచేశారు.
అల్లు అర్జున్ హంగామా వల్లే ఘటన
సినిమా థియేటర్ వద్ద అల్లు అర్జున్ హంగామా చేయటం వల్లనే తొక్కిసలాట జరిగిందని సీఎం అన్నారు. ‘అల్లు అర్జున్ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హడావిడి చేశారు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. కంట్రోల్ కాలేదు. ఆయనను ఈ కేసులో ఏ1గా కాకుండా ఏ11 గా చేర్చారు. అక్కడ మహిళ ప్రాణం పోయింది.. అందుకు ఎవరు బాధ్యులు? ఆమె కొడుకు ఇంకా కోమాలోనే ఉన్నాడు.
కోమా నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి పోయిన తల్లిని తెచ్చివ్వగలరా?’అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘అల్లు అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను అతనికి తెలుసు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ మనిíÙ. ఆయనకు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి నాకు బంధువు. ఈయన కూడా కాంగ్రెస్ నేతనే’అని పేర్కొన్నారు. కాగా తన ఫేవరెట్ హీరో కృష్ణ అని తెలిపారు. ‘ఇప్పుడు నేనే ఒక స్టార్‌ను. నాకే ఫాన్స్ ఉంటారు’అని రేవంత్‌రెడ్డి చమత్కరించారు.
రైతులను పట్టించుకోని బీజేపీ
బీజేపీ ఎప్పుడూ దేశం కోసం, రైతుల కోసం పనిచేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. వాళ్లు ఇచ్చే నినాదాలకు, క్షేత్రస్థాయిలో చేసే పనికి చాలా తేడా ఉందని అన్నారు. ఈ తేడాను ప్రజలకు సవివరంగా తెలియచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సుమారు 750 మంది రైతులు చనిపోతే.. ప్రధాని మోదీ ఒక్కసారైనా వారి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారా? అని ప్రశ్నించారు. బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తే.. వారే ఆ పార్టీని ఓడిస్తారని పేర్కొన్నారు.
11 ఏళ్లలో నరేంద్ర మోదీ ఒక్కసారి కాదు, మూడు సార్లు దేశ ప్రజలను మోసం చేశారని సీఎం విమర్శించారు. రాహుల్, రేవంత్ ట్యాక్స్ (ఆర్‌ఆర్ ట్యాక్స్) అని ఆరోపణలు చేస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ.. అందుకు ఒక్క ఆధారమైన చూపాలని సవాల్ విసిరారు. వచ్చే సంవత్సరం వైబ్రంట్ గుజరాత్‌కు కార్యక్రమానికి పోటీగా తెలంగాణ రైజింగ్ నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తామని ప్రకటించారు. అదానీ విషయంలో రాహుల్‌గాంధీ బాటలోనే తానూ ఉన్నానని తెలిపారు.
చట్టం తనపని తాను చేసుకుపోతుంది (బాక్స్)
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో తన జోక్యమేదీ ఉండదని స్పష్టంచేశారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో నా ప్రమేయం కానీ, జోక్యం కానీ ఏముంటుంది? అంతా చట్టానికి లోబడే ఉంటుంది’అని అన్నారు. మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్‌బాబు దాడి చేసిన ఘటనలో కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు నడుచుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. తాను ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ కేబినెట్ విస్తరణ అంటూ కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment