
సాక్షి, నెల్లూరు జిల్లా: ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ అంటూ ఎద్దేవా చేశారు. బుడ బుక్కల పవన్ పగటివేషాలు వేస్తున్నాడు. ఏపీకి చంద్రబాబు, పవన్ రాహు కేతువుల్లా దాపురించారు. ప్రభుత్వంపై బురదజల్లడమే ఈనాడు పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు హయాంలో కరువు విలయతాండవం చేసింది. మండలాలకు మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. జలాశయాలు ఎడారులను తలపించాయి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో కరువు అనే మాటే లేదు. సంక్షేమానికి ప్రకృతికూడా సహకరిస్తోంది. క్రమం తప్పకుండా వర్షాలు కురుస్తున్నాయి. సాగునీటి సమస్యలే తలెత్తలేదు. పచ్చ మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. రామోజీరావు లాంటి వ్యక్తి దిగజారి ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. పత్రికలు పారదర్శకంగా ఉండాలి. ఎవరెన్ని కుట్రలు చేసినా రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తాం’’ అని మంత్రి కాకాణి స్పష్టం చేశారు.
చదవండి: ‘ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ ఏం అడిగారు?’