
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు వినేందుకే ప్రజాదర్బార్ ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరలోనే వారి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వినేందుకే ప్రగతిభవన్‌కు ఉండే అడ్డుగోడలను తొలగించి ప్రజాభవన్‌గా మార్చామని పొన్నం తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కె.సత్యనారాయణతో పాటు సీపీఐ నాయకులను కలిసేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూమ్‌భవన్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మతో సమావేశమయ్యారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు, ప్రతిపక్ష నేతలు కలిసేందుకు కూడా అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ విజయంలో సీపీఐ సంపూర్ణ సహకారం, మద్దతు ఉందని, భవిష్యత్‌లో కూడా తాము కలిసే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయంతో రాష్ట్రంలో ప్రజాస్వామిక పునాది పడిందన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురవరం వారికి అభినందనలు తెలిపారు.