
టీజీఎస్ ఆర్టీసీలో తొలిసారి పూర్తిస్థాయి నియామకాలు
ఎస్సీ వర్గీకరణ పూర్తవటంతో మార్గం సుగమం
నియామక సంస్థలకు బాధ్యత అప్పగింత
త్వరలో అందుబాటులోకి 2 వేల మంది కొత్త డ్రైవర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో తొలి నియామక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారి వివిధ కేటగిరీల్లో నియమకాలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు పోస్టుల భర్తీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఏకంగా 3,038 పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఇప్పటివరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని సంస్థే చేపట్టే విధానం ఉండేది. తొలిసారి నియామక సంస్థలకు ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించింది. టీజీపీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డులు కేటగిరీల ప్రకారం నియామక ప్రక్రియలను చేపట్టనున్నాయి.
ఏడెనిమిది నెలల క్రితమే కసరత్తు
తెలంగాణ ఆర్టీసీలో ప్రసుతం చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతినెలా సగటున 200 మంది రిటైర్ అవుతుండటంతో ఖాళీల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీ చేపట్టాలని ఏడెనిమిది నెలల క్రితమే ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. దాదాపు ఐదు వేల ఖాళీల భర్తీకి ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం 3,038 పోస్టులకే అనుమతి ఇచ్చింది. అయితే తాము నియామక పరీక్షలకు రూపొందించుకున్న కేలండర్ ఆధారంగానే ఆర్టీసీలో పోస్టుల భర్తీ కూడా ఉంటుందని ఆయా సంస్థలు ప్రకటించాయి.

దీంతో వెంటనే నియామకాలు చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి రావటంతో, అది తేలిన తర్వాతే నియామకాలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగి, రోస్టర్ పాయింట్లపై స్పష్టత రావడంతో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది.
కీలకమైన డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చూడనుంది. మరో రెండు నెలల్లో ప్రక్రియ మొదలవుతుందని, నాలుగు నెలల్లో కొత్త డ్రైవర్లు అందుబాటులోకి వస్తారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జోనల్ పోస్టులు, రీజియన్ పోస్టుల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లను సూచిస్తూ ఆర్టీసీ సంబంధిత బోర్డులకు వివరాలు అందజేయాల్సి ఉంది. బోర్డులు అడగ్గానే వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అప్పటి వరకు ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లతో..
ప్రస్తుతం ఆర్టీసీలో 1,600 డ్రైవర్‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్న డ్రైవర్లపై తీవ్ర పనిభారం పెరిగింది. డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో 1,500 మంది ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేందుకు సంస్థ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మ్యాన్‌పవర్ సప్లయిర్స్ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఎంపిక చేసిన డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. వీరిని మూడు నెలల పాటు కొనసాగిస్తామని ఒప్పందంలో సంస్థ పేర్కొంది.

తాజాగా రెగ్యులర్ డ్రైవర్ల నియామకం వరకు వీరిని కొనసాగించాలని నిర్ణయించింది. ఇలా తాత్కాలిక పద్ధతిలో ఎంపికైన వారు, రెగ్యులర్ నియామకాల కోసం కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. వీరు శిక్షణ పొంది ఉన్నందున, రెగ్యులర్ నియామకాల్లో వీరికి ఆయా బోర్డులు ప్రాధాన్యం ఇచ్చే వీలుందని అధికారులు చెబుతున్నారు.
త్వరలో భర్తీ ప్రక్రియ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం వచ్చిన తర్వాత యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో తొలి సారి భర్తీ ప్రక్రియ చేపడుతున్నాం. 3,038 ఖాళీలను నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయనున్నాం. ఇందుకోసం ఆయా బోర్డులు నియామక క్యాలెండర్‌ను సిద్ధం చేసుకున్నాయి. వాటి ప్రకారం వీలైనంత త్వరలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది. – రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్