
తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ నుంచి ప్రతిరోజు తిరుపతికి రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళతారని పొన్నం ప్రభాకర్ ప్రస్తావించారు.
ప్రస్తుతం కరీంనగర్ నుంచి తిరుపతికి వారానికి రెండు సార్లు, గురువారం, ఆదివారం మాత్రమే రైలు వెళ్తుందన్నారు. ఆ ఎక్స్ ప్రెస్ రైలు తిరుపతి నుంచి కరీంనగర్‌కు బుధ, శనివారాల్లో బయలుదేరుతుందన్నారు. యూపీఏ హయాంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతికి వెళ్లడానికి వీలుగా ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.
ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ క్రమంలో ఈ రైలు ప్రతిరోజు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గత పదేళ్లుగా రైల్వే శాఖ మంత్రిగా మీకు, స్థానిక ఎంపీ బండి సంజయ్‌కి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ లేఖలో పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రైలును నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.