
ఢిల్లీ: మీరు మా కంటే (భారత్) అరగంట వెనకబడలేదు.. అర్థ శతాబ్ధం వెనకబడ్డారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. అదే సమయంలో భారత్‌లో పలు టీవీ ఛానెళ్ల యాంకర్లపై మండిపడ్డారు. కాశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు.
ఆదివారం మహారాష్ట్ర పర్భానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై దాడి చేసేందుకు తాము అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్ నాయకుల హెచ్చరికలపై ఆయన స్పందించారు. ‘తమ వద్ద అణు బాంబులు, అణు బాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం ఎందుకు మౌనంగా ఉంటుంది. అందుకు గట్టిగానే బదులిస్తోంది.
మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు
అభివృద్ధిలో మా దేశానికి, మీ దేశానికి పోలిక ఎక్కడా? అభివృద్ధిలో మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదు’ అని గుర్తు చేశారు. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ (అరబ్ భాషలో తీవ్రవాదులు) కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్‌ఐఎస్ వారసులని చూపిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.
Parbhani, Maharashtra: AIMIM Chief Asaduddin Owaisi says, "Pakistan always talks about being a nuclear power; they need to remember if they enter a country and kill innocent people, that country will not sit quietly. No matter the government, by killing our people on our land,… pic.twitter.com/zB80FJcY8G
— ANI (@ANI) April 27, 2025
ప్రధాని మోదీకి ఎంపీ అసదుద్దీన్ డిమాండ్
అంతేకాదు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి, హ్యాకర్లను ఉపయోగించి ఆ దేశంలో ఇంటర్నెట్‌ను హ్యాక్ చేసేందుకు భారత్‌కు అనుమతి ఉందని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలహీన పరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

షేమ్
పలు టీవీ ఛానెళ్లలో పనిచేసే యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షేమ్. కశ్మీర్ మన అంతర్భాగం. కాశ్మీరీలు కూడా మనదేశంలో అంతర్భాగమే. అలాంటి వారిని మనం ఎలా అనుమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించింది ఓ కాశ్మీరీనే. గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచింది కూడా ఓ కాశ్మీరీనే అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎత్తి చూపారు.