
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర పరాజయంపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఊహించలేదని, ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయమని అన్నారు .
మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శరద్ పవార్ మాట్లాడారు. 288 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ 41 స్థానాల్ని గెలిచారని ప్రస్తావించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఈ ఫలితాల్ని మేం ఊహించలేదు. ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయం. నాకంటే అజిత్ పవార్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహరాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ స్థాపించిన నాటి నుంచి తొలిసారి శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది.
ఈ తరుణంలో పలువురు ఎన్సీపీ నేతలు.. శరద్ పవార్ రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఏం చేయాలో వాళ్లకు అనవసరం నేను ఏం చేయాలో నేను, నా సహచరులు నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించారు.