
నవీ ముంబైలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20లో టోర్నీలో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో రిలయన్స్ 1 జట్టుకు ఆడుతున్న తిలక్.. సెంట్రల్ రైల్వే టీమ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న రిలయన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది.
తిలక్.. సహచరుడు శివాలిక్‌తో కలిసి 112 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు రిలయన్స్ 1 స్టార్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. రెండు రోజుల కిందట ఇదే టోర్నీతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ రెండో మ్యాచ్‌లోనే జట్టులో కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ మళ్లీ గాయం బారిన పడ్డాడా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. హార్దిక్, తిలక్ ఇద్దరు ముంబై ఇండియన్స్‌కు ఆడనున్న విషయం తెలిసిందే.