
ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ప్రయత్నాలు చేస్తున్న హైదరాబాద్ వ్యాపారవేత్త
అప్రమత్తమైన బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం
ఫ్రాంచైజీలు, ప్లేయర్లు, సహాయక సిబ్బందికి హెచ్చరికలు జారీ
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా సాగుతున్న లీగ్ 18వ సీజన్‌లో ఫిక్సింగ్ జరిగే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్లు, జట్ల యజమానులు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లకు బీసీసీఐ కీలక సూచనలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌లో ఫిక్సింగ్ జరిగే ఆస్కారముందని లీగ్ తో సంబంధం ఉన్న వారందరికీ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపార వేత్త దీనికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. అలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని బీసీసీఐ అవినీతి నిరోధక భద్రతా విభాగం (ఏసీఎస్‌యూ) సూచించింది. ఆటగా ళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, జట్టు యజమానులు, వ్యాఖ్యాతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతూ వారికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం ద్వారా వారిని ఆకర్షించుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఏసీఎస్‌యూ ఆందోళన వ్యక్తం చేసింది.
ఆ వ్యా పారవేత్తకు బుకీలు, పంటర్‌లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని కూడా సమాచారం. అతడు గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని... ఈనేపథ్యంలో ఐపీఎల్‌తో ప్రత్య క్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ఏసీఎస్‌యూ హెచ్చరించింది. ఎవరైనా ఖరీదైన బహుమతులు, నగలు ఇవ్వజూపితే తమకు తెలియ పరచాలని స్పష్టం చేసింది. అభిమానిగా నటిస్తూ తరచూ ఆటగాళ్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం అతడికి అలవాటని... అది వీలు పడకపోతే ప్లేయర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తాడని బీసీసీఐ హెచ్చరించింది. విదేశాల్లో ఉండే వారిని సైతం దీనికోసం సంప్రదిస్తాడని.. సామాజిక మాధ్యమాల్లోనో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.