
సూర్యకుమార్ యాదవ్(PC: BCCI)
ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం(India Beat England)పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పందించాడు. సమిష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైనందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారని.. అందుకు తగ్గ ఫలితాలను మైదానంలో చూస్తున్నామంటూ సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు.
4-1తో కైవసం
ఇక ఎక్కువసార్లు తాము రిస్క్ తీసుకునేందుకే మొగ్గుచూపుతామన్న సూర్య.. అంతిమంగా జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో విజయంతో సిరీస్‌ను ఆరంభించిన సూర్యసేన.. చెన్నైలోనూ అదే ఫలితం పునరావృతం చేసింది.
అనంతరం రాజ్‌కోట్‌లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు.. పుణెలో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20లోనూ అద్భుత ఆట తీరు కనబరిచింది. వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.
అభిషేక్ శర్మ ఊచకోత
ఓపెనర్ సంజూ శాంసన్(16) మరోసారి వైఫల్యాన్ని కొనసాగించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) మాత్రం పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో తిలక వర్మ(24), శివం దూబే(13 బంతుల్లో 30) మాత్రమే రాణించారు.
ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బట్లర్ బృందానికి టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చాడు. బెన్ డకెట్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు తమ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
97 పరుగులకే ఆలౌట్
ఈ క్రమంలో ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) ఒక్కడు కాసేపు పోరాడగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఏమాత్రం సహకారం అందలేదు. ఫలితంగా 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో 150 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే రెండు, స్పిన్నర్లు వరుణ్ చక్రర్తి రెండు, అభిషేక్ శర్మ రెండు, రవి బిష్ణోయి ఒక వికెట్ తీశారు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
రిస్క్ అని తెలిసినా
ఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ‘‘జట్టులోని ఏ సభ్యుడైతే ఈరోజు రాణించగలడని భావిస్తానో.. అతడిపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాను. నెట్స్‌లో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతున్నారు. నాకు ఎప్పుడైతే వారి అవసరం ఉంటుందో అప్పుడు కచ్చితంగా రాణిస్తున్నారు.
మ్యాచ్‌కు ముందు రచించిన ప్రణాళికలకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఒక్కోసారి రిస్క్ అని తెలిసినా వెనకడుగు వేయడం లేదు. అంతిమంగా మా అందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యం.
వాళ్లిద్దరు అద్భుతం
ఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఈరోజు అద్భుతంగా సాగింది. టాపార్డర్‌లో ఓ బ్యాటర్ ఇలా చెలరేగిపోతుంటే చూడటం ముచ్చటగా అనిపించింది. ఈ ఇన్నింగ్స్ చూసి అతడి కుటుంబం కూడా మాలాగే సంతోషంలో మునిగితేలుతూ ఉంటుంది.
మరోవైపు.. వరుణ్ చక్రవర్తి.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్లను చక్కగా వినియోగించుకుంటున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. అందుకు ఫలితమే ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శన. అతడి వల్ల జట్టుకు అదనపు శక్తి లభిస్తోంది. అతడొక అద్భుతం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఈ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి పద్నాలుగు వికెట్లు తీశాడు.
చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్
An impressive way to wrap up the series 🤩#TeamIndia win the 5th and final T20I by 150 runs and win the series by 4-1 👌
Scoreboard ▶️ https://t.co/B13UlBNLvn#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/aHyOY0REbX— BCCI (@BCCI) February 2, 2025