టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)పై హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్‌తో చివరి టీ20లో భారీ సెంచరీతో చెలరేగిన అభిషేక్ ఆటతీరు అమోఘమని కొనియాడాడు. ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ తానెప్పుడూ చూడలేదని గంభీర్ అన్నాడు.
పరుగుల సునామీ
కాగా ఇంగ్లండ్‌తో నామమాత్రపు ఐదో టీ20(India vs England)లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. పదిహేడు బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోకుండా చేసి.. మొత్తంగా 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏకంగా పదమూడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు.
ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిషేక్ పరుగుల వరద పారిస్తుంటే వాంఖడేలో నేరుగా ఈ అద్బుతాన్ని వీక్షించిన ప్రేక్షకులతో పాటు.. టీవీలు, ఫోన్లలో మ్యాచ్ చూస్తున్న క్రికెట్ ప్రేమికులూ ఆనందంతో మురిసిపోయారు.
ప్రశంసల వర్షం
ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయాడు. ‘అభిషేక్ నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. కొత్త తరం ఆటగాళ్లు భయం లేకుండా దూకుడుగా ఆడుతున్నారు. అలాంటి వాళ్లకు అండగా నిలుస్తాం.
ఇలాంటి టీ20 సెంచరీ చూడనేలేదు
ఇంగ్లండ్ బౌలర్లు 140–150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతుంటే అభిషేక్ అలవోకగా సిక్సర్లు బాదాడు. దీనికంటే గొప్ప టీ20 శతకాన్ని చూడలేదు. ఫలితాలు అనుకూలంగా వస్తే అంత సవ్యంగా సాగుతుంది. పరాజయాలు ఎదురైనప్పుడే జట్టుపై విమర్శలు వస్తాయి. అలాంటి కష్ట కాలాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం.
వన్డేల్లోనూ ఇదే దూకుడు
ఈ జట్టు చాలా కాలంగా కలిసి ఆడుతోంది. వారి మధ్య మంచి అనుబంధం ఉంది. 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం అంటే ఎలా ఉంటుందో మా ఆటగాళ్లకు తెలుసు. వన్డేల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తాం’ అని గంభీర్ పేర్కొన్నాడు.
కాగా ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత టీ20 సిరీస్‌లో భాగంగా కోల్‌కతా, చెన్నై మ్యాచ్‌లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఓటమిపాలైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
247 పరుగులు
ఈ క్రమంలో వాంఖడే మైదానంలో ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావించిన ఇంగ్లండ్ ఆశలపై భారత జట్టు నీళ్లు చల్లింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. అభిషేక్ శర్మ సునామీ శతకం కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో.. తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది.
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ఫిలిప్ సాల్ట్(23 బంతుల్లో 55) మెరుపు హాఫ్ సెంచరీతో అలరించినా.. మిగతా వాళ్లలో జాకొబ్ బెతల్(10) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు కూల్చగా.. రవి బిష్ణోయి ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌పై 150 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 4-1తో ముగించింది. తదుపరి ఫిబ్రవరి 6 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment