
ఐపీఎల్-2025 (IPL 2025)లో మరో రసవత్తర పోరు.. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ (KKR vs PBKS) మధ్య మ్యాచ్.. శనివారం నాటి ఈ పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదిక.
ఈ సీజన్‌లో ఇప్పటికే ముఖాముఖి ఇరుజట్లు తలపడగా.. అతి స్వల్ప లక్ష్యాన్ని (112) కాపాడుకుని పంజాబ్ కేకేఆర్‌పై జయభేరి మోగించింది. తద్వారా కేకేఆర్ మాజీ కెప్టెన్, పంజాబ్ ప్రస్తుత సారథి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన పాత జట్టుపై ప్రతీకారం తీర్చుకున్నాడు.
వ్యూహాత్మక నిర్ణయం
ఇక సొంతగడ్డపై కేకేఆర్‌ను ఓడించాలనే పట్టుదలతో మరోసారి అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దేశీ స్పిన్నర్ తనూశ్ కొటియాన్‌ను నెట్ బౌలర్‌గా రప్పించింది. అతడి బౌలింగ్‌లో పంజాబ్ బ్యాటర్లు శుక్రవారం ప్రాక్టీస్ చేశారు.
అతడే ఎందుకు?
ఈ సందర్భంగా పంజాబ్ స్పిన్ బౌలింగ్ కోచ్ సునిల్ జోషి.. తనూశ్‌కు సలహాలు, సూచనలు ఇవ్వడం కనిపించింది. కాగా ఇప్పటికే పంజాబ్ జట్టులో యజువేంద్ర చహల్ రూపంలో మేటి స్పిన్నర్ అందుబాటులో ఉండగా.. హర్‌ప్రీత్‌బ్రార్, ప్రవీణ్ దూబే అతడికి సహకారం అందిస్తున్నారు. అయితే, వీరంతా మణికట్టు స్పిన్నర్లే.
అందుకే వైవిధ్యం కోసం ఆఫ్ స్పిన్నర్ అయిన తనూశ్ కొటియాన్‌ను పంజాబ్ నాయకత్వ బృందం బరిలోకి దించింది. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్లు సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అతడి బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేయించింది.
ముంబైకి ప్రాతినిథ్యం
కాగా 26 ఏళ్ల తనూశ్ కొటియాన్ దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన అద్భుత స్పిన్ నైపుణ్యాలతో దిగ్గజ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగానూ నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, భారత్-ఎ జట్టుకు ఆడుతున్నా.. ఇంత వరకు ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.
ఇక ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై గెలవడంలో తనూశ్‌ది కీలక పాత్ర. ఈ ఆర్థోడాక్స్ ఆఫ్ స్పిన్నర్ ఇప్పటి వరకు 33 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 101 వికెట్లు తీశాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
వేలంలో అమ్ముడుపోలేదు.. నెట్‌బౌలర్‌గా వచ్చాడు
అంతేకాదు రెండు శతకాలు, 13 ఫిఫ్టీల సాయంతో 1525 పరుగులు సాధించాడు. ఇక లిస్ట్-ఎ క్రికెట్‌లో 19 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు తీయడంతో పాటు.. 90 రన్స్ చేశాడు. అదే విధంగా 25 టీ20 మ్యాచ్‌లలో కలిపి 25 వికెట్లు కూల్చాడు.
కాగా తనూశ్ కొటియాన్ గతేడాది రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. వేలానికి ముందు ఫ్రాంఛైజీ అతడిని వదిలేయగా.. ఐపీఎల్-2025 మెగా ఆక్షన్‌లోకి రూ. 30 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. కానీ పది ఫ్రాంఛైజీల్లో ఒక్కటీ తనూశ్‌పై ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇప్పుడు పంజాబ్ జట్టులోకి నెట్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్‌పై కావ్యా మారన్ ఫైర్