నా బ్యాటింగ్‌ అద్బుతమే.. కానీ మా వాళ్లే అలా!.. అతడైతే గ్రేట్‌: రియాన్‌ | Riyan Parag Blames Own Approach for RR 1 Run loss to KKR We Were Not Clinical | Sakshi
Sakshi News home page

నా బ్యాటింగ్‌ అద్భుతం.. కానీ మా ప్రదర్శన గొప్పగా లేదు.. రసెల్‌ మాత్రం సూపర్‌

Published Sun, May 4 2025 9:03 PM | Last Updated on Sun, May 4 2025 9:32 PM

Riyan Parag Blames Own Approach for RR 1 Run loss to KKR We Were Not Clinical

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో రాజస్తాన్‌ రాయల్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR vs RR)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (Riyan Parag)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

అప్పటికి నా బ్యాటింగ్‌ అద్భుతమే..
తాను ఆఖరి వరకు క్రీజులో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పరాగ్‌ పేర్కొన్నాడు. ‘‘నేను అవుట్‌ కావడం తీవ్ర నిరాశపరిచింది. ఆఖరి రెండు ఓవర్ల వరకు క్రీజులో ఉండాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కానీ దురదృష్టవశాత్తూ 18వ ఓవర్లోనే అవుటయ్యా.

16, 17 ఓవర్లలో మేము ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోయాం. విజయ సమీకరణం విషయంలో నేను సరైన విధంగా లెక్కలు వేసుకోలేకపోయాను. మ్యాచ్‌ను విజయంతో ముగించి ఉంటే ఎంతో బాగుండేది.

అవుటయ్యేంత వరకు నేను అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాను. ఓడిపోయిన కెప్టెన్‌గా ఇంటర్వ్యూకు వెళ్లకూడదని నాకు నేనే పదే పదే చెప్పుకొన్నా’’ అని రియాన్‌ పరాగ్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

మా ప్రదర్శన గొప్పగా లేదు
అదే విధంగా జట్టు ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ‘‘ఆఖరి ఆరు ఓవర్లలో మాకు మరింత మెరుగైన ఆప్షన్లు దొరికి ఉంటే బాగుండేది. ముఖ్యంగా బౌలర్ల విషయం గురించి చెబుతున్నా. ఏదేమైనా పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం వల్ల ఫలితం ఏమీ ఉండదు.

మ్యాచ్‌ను పూర్తి చేసి ఉంటే ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చేది కాదు. రసెల్‌ ఒక సమయంలో 10 బంతుల్లో రెండు పరుగుల వద్ద ఉన్నాడు. ఆ తర్వాత అతడు బ్యాట్‌ ఝులిపించిన తీరు చూడటానికి ముచ్చటగా అనిపించింది.

ఈ మైదానంలో సులువుగానే సిక్సర్లు కొట్టవచ్చు. వికెట్‌ కాస్త ట్రికీగా ఉన్నా.. పర్లేదు కాస్త మెరుగైందే. అందుకే నా ప్రణాళికలు చక్కగా అమలు చేసుకుంటూ ముందుకు సాగాను. మైదానంలో మా ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. అందుకే నేను ఇక్కడ ఇలా నిలబడాల్సి వచ్చింది’’ అని రియాన్‌ పరాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

కాగా ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన రాజస్తాన్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఓపెనర్‌ సునిల్‌ నరైన్‌ (11)ను అవుట్‌ చేసి యుధ్‌వీర్‌ శుభారంభమే అందించాడు. కానీ మరో ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ (35), కెప్టెన్‌ అజింక్య రహానే (30) ఇన్నింగ్స్‌ గాడిన పెట్టారు.

ఈ క్రమంలో అంగ్‌క్రిష్‌ రఘువన్షీ (44) కూడా వీరికి సహకారం అందించగా.. ఆండ్రీ రసెల్‌, రింకూ సింగ్‌ పూర్తిగా గేరు మార్చేశారు. ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. కేకేఆర్‌ స్కోరును 200 దాటించారు.

రసెల్‌ (25 బంతుల్లో 57 నాటౌట్‌), రింకూ (6 బంతుల్లో 19 నాటౌట్‌) మెరుపుల కారణంగా 20 ఓవర్లు పూర్తయ్యేసరికి.. కేకేఆర్‌ కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. రాజస్తాన్‌ బౌలర్లలో యుధ్‌వీర్‌ సింగ్‌, మహీశ్‌ తీక్షణ, రియాన్‌ పరాగ్‌, జోఫ్రా ఆర్చర్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ రాయల్స్‌ కేకేఆర్‌ బౌలర్ల దెబ్బకు టాపార్డర్‌ కుదేలైంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (34) ఫర్వాలేదనిపించగా.. వైభవ్‌ సూర్యవంశీ(4) మరోసారి నిరాశపరిచాడు. ఇక కునాల్‌ సింగ్‌ రాథోడ్‌, ధ్రువ్‌ జురెల్‌, వనిందు హసరంగ డకౌట్‌ అయ్యారు.

ఈ క్రమంలో జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ రియాన్‌ పరాగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించాడు. అతడికి తోడుగా షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (29) కాసేపు నిలబడగా.. రియాన్‌ అవుటైన తర్వాత కథ మారిపోయింది.

పద్దెమినిదవ ఓవర్‌ నాలుగో బంతికి హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో వైభవ్‌ అరోరాకు క్యాచ్‌ ఇచ్చి రియాన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోఫ్రా ఆర్చర్‌ (12) శుభమ్‌ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్‌)తో కలిసి స్కోరు బోర్డును ముందు నడిపాడు. ఇద్దరూ కలిసి సింగిల్స్‌ , డబుల్స్‌ తీస్తూ పందొమ్మిదో ఓవర్లో 11 పరుగులు స్కోరు చేశారు.

ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో రాజస్తాన్‌ విజయానికి 22 పరుగులు అవసరం కాగా.. 2, 1, 6, 4, 6 స్కోరు చేసి రాజస్తాన్‌ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. అయితే, ఆఖరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా ఆర్చర్‌ రనౌట్‌ కావడంతో కథ కంచికి చేరుకుండానే ముగిసిపోయింది.
 చదవండి: IND vs SL: టీమిండియాకు చేదు అనుభవం.. లంక చేతిలో ఓటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement